calender_icon.png 15 May, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేజీ స్థాయిలో సంస్కృతం అవసరమా?

12-04-2025 12:00:00 AM

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని అనుమతించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోవడం ఆందోళనకరమైన విషయం. దీనివల్ల మాతృభాషగా ఉన్న తెలుగు మృతభాషగా మారే ప్రమాదం ఉందని తెలుగుభాషా పండితులు, భాషాభిమానులు, భాషాసంఘాలు, రాష్ట్రంలోని పలు వురు ఉపన్యాసకులు, ఆచార్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కుల కోసం ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు సంస్కృతాన్ని బోధిస్తున్నాయి.

దీని ఫలితంగా ఇంటర్మీడియట్ విద్యలో తెలుగు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో సంస్కృతం బోధించటం వల్ల అటు ఆ భాష అర్థం కాక, ఇటు తెలుగుకూ దూరమై పిల్లల భవిష్యత్తు గందరగోళంగా మారే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యక్తత ఎంతైనా ఉంది. మాతృభాషను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అంతరించి పోతున్న భాషల జాబితాలో తెలుగు చేరుతుందని ఇప్పటికే ‘యునెస్కో’ సర్వే హెచ్చరించింది. రష్యా, జపాన్, జర్మనీ దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఆరు నెలలు వారి మాతృభాషను నేర్చుకోవాలనే నిబంధన ఉంది.

అలాగే, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు మాతృభాషకు ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరు తెలుగు వాళ్లు కలిస్తే హిందీ లేదా ఆంగ్లంలో మాట్లాడుకుంటారనే అపవాదు ఉంది. ఈ తరుణంలో తెలుగుభాషను రక్షించుకోవాలనే మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్రంలో పదవ తరగతి వరకూ మాతృభాషను తప్పనిసరి చేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాలు కాగితాలకే పరిమితయ్యాయనే విమర్శలు విని పిస్తున్నాయి.

కేంద్ర విద్యాసంస్థల్లో తెలుగును ద్వితీయభాషగా బోధించాలనే నిబంధన ఉంది. కానీ, ఆయా సంస్థలు ఆ నిబంధనను పట్టించుకోవడం లేదని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన, న్యాయ విభాగాల్లో మాతృభాషను అమలు చేయాలి. అలాగే న్యాయ, వైద్య, వైజ్ఞానిక, ఇంజినీరింగ్ పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేయాలి. ఇలా చేయడం ద్వారా విషయాలపై స్పష్టమైన అవగాహన వస్తుంది. ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని అనేక విద్యా కమిషన్‌లు ప్రతిపాదించా యి. 2022 నుంచి పాఠశాల విద్యను ఆంగ్ల మాద్యమంలో అందించడానికి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దీంతో అనేక తెలుగు మీడియం పాఠశాలలు మూతపడ్డాయి. ఆంగ్ల మాద్యమంలో చదివినప్పటికీ మాతృభాషతో మమకారం, అనుబంధాన్ని విద్యార్థులు పెంచుకోవాలి. మాతృభాషపై పట్టు సాధిస్తే ఏ పరాయి భాషనైనా సులభంగా నేర్చుకోగలమనే విషయాన్ని అందరూ గుర్తించాలి. మాతృభాషల్లో విద్యాభ్యాసం చేసిన వారికి పోటీ పరీక్షల్లో గ్రేస్ మార్కులు ఇవ్వాల్సిన అవసరమూ ఎంతైనా ఉంది.  

తెలుగుకు పూర్వ వైభవం

తెలంగాణలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీతో ప్రీస్కూళ్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావి స్తోంది. దీనిద్వారా తెలుగు మాధ్యమం పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు. మన విద్యా వవస్థలో 5+3+3+4 విధానాన్ని అమలు చేయాలని, ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలని నూతన విద్యా విధానం చెబుతోంది. దీనికితోడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి, విద్యా విధానంలో సంస్కరణలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.   

అలాగే మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి వరకు తెలుగు ను తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు, మైనార్టీ స్కూళ్లలో తెలుగు బోధన తప్పనిసరి కాదు. కానీ, 2025 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులు పదవ తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా చదవాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిం ది. ఈ ఉత్తర్వుల ప్రకారం తెలుగు మాతృభాషగా లేని విద్యార్థులు ద్వితీయభాషగా తెలుగును అభ్యసించాల్సి ఉంటుంది.

ఇందుకోసం తెలుగు పుస్తకాలను విద్యార్థుల స్థాయికి తగినట్లు, సులభంగా అర్థమ య్యే రీతిలో తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రూపొందించింది. ఈ పుస్తకాల్లో తెలంగాణ రచయితలు, కవులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు తెలుగు సాహిత్యంలోని కవిత్వం, పద్యం, గద్యం, వ్యాసం, నాటిక, ఏకపాత్రాభినయం, లేఖనం, భాషణం వంటి ప్రక్రియలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. వీటిద్వారా విద్యార్థు లకు నాణ్యమైన విద్య అందడంతోపాటు తెలుగు భాషపట్ల జిజ్ఞాస పిల్లల్లో పెం పొందే అవకాశం ఉంది. ఇలాంటి ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్  పాఠశాల్లో అడ్మిషన్లు పెరిగి, తెలు గు మాద్యమానికి పూర్వ వైభవం వస్తుందని భాషాభిమానులు విశ్వసిస్తున్నారు.

శాసనసభ్యుల మాటలు విచారకరం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఓ వర్గానికి చెందిన శాసనసభ్యులు తమకు ఇంగ్లీష్, హిందీ మాత్రమే      వస్తాయని, తెలుగు రాదని చాలా గర్వంగా చెప్పారు. అది నిజంగా విచారకరం. రాష్ట్రంలో మెజారిటీ ప్రజల మాతృభాషగా తెలుగు ఉన్నప్పటికీ కొందరు చట్టసభ సభ్యులు తమకు తెలుగు అర్థం కాదనడం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్ర అధికార భాషల్లో తెలు గు ఒకటి. ఈ భాషను నేర్చుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. రాష్ట్రంలోని ఇతర పౌరులకు ఆదర్శంగా ఉండాల్సిన చట్టసభ సభ్యులు తమకు తెలుగు రాదని ప్రకటించడం పట్ల తెలుగు భాషాభిమానులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ఉన్నతాధికారులకు, చట్టసభల్లోని సభ్యులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు తెలుగుపై అవగాహన కలిగించే విధంగా శిక్షణా తరగతులు నిర్వహించాలి. తద్వారా వారు భాషను అర్థం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం, తెలంగాణ భాష, సాంస్కృతిక మండలి వంటి ప్రముఖ సంస్థలతోపాటు భాషాభిమానులు కోరుకుంటున్నారు. 

ప్రాచీన హోదా లభించినా...

కేంద్ర ప్రభుత్వం తెలుగుభాషకు ప్రాచీ న భాషా హోదాను కల్పించింది. ఇంత పెద్ద గౌరవం దక్కినప్పటికీ రాష్ట్రంలో ప్రాచీన హోదాకు సంబంధించిన కార్యాలయాన్ని ప్రారంభించుకోక పోవడం విచా రించదగిన విషయం. తెలుగుకు లభించిన ఈ గౌరవం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, పరిశోధనలు, పూర్వక వుల రచనలు ప్రచురించుకోవడానికి ఎ న్నో అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయాన్ని అంత పెద్దగా పట్టించుకోవడం లేదు.

మన మాతృభాష అయిన తెలుగు అంతరించి పోతున్న భాష ల జాబితాలో చేరకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిమీద ఉంది. తెలు గు మాధ్యమంలో విద్యాభ్యాసం చేసిన వా రికి ఉద్యోగవకాశాలు తక్కువ అనే అపోహ చాలామందిలో ఉంది. అయితే, భాషలో పట్టుంటే మీడియా తదితర రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంది. తెలుగును కాపాడుకు నే బాధ్యతను కేవలం ప్రభుత్వంపైనే వదిలేయకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు పాత్రను పోషించాలి.

వ్యాసకర్త: డాక్టర్ ఎస్. విజయ భాస్కర్, సెల్: 9290826988