26-07-2025 09:50:41 PM
గర్గుల్-రామారెడ్డి రహదారి తాత్కాలికంగా మూసివేత
ఆర్ అండ్ బి అధికారుల వెల్లడి
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి-గర్గుల్ గ్రామాలను కలిపే ప్రధాన రహదారిలో గంగమ్మ వాగుపై వంతెన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ వంతెన పూర్తికాకపోవడంతో వాహనాలు తాత్కాలిక డైవర్షన్ రోడ్డుపై ప్రయాణిస్తు న్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వాగులో నీటి ప్రవాహం తీవ్రమవడంతో ఈ మార్గం ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆర్ అండ్ బి అధికారులు శనివారం తెలిపారు. నీటి ఉధృతి పెరగడం వల్ల ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు డైవర్షన్ రోడ్డుపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు.
ప్రజలు అనవసరంగా ఈ మార్గంలో ప్రయాణించవద్దని, అత్యవసర ప్రయాణాల కోసం మాత్రమే వేరే మార్గాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు, వంతెన నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే పనులు వేగవంతం చేయాలని చర్యలు చేపట్టారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, మరోవైపు ప్రజల సహకారం కూడా అత్యంత అవసరం అని తెలిపారు. వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం, అని ఆర్అండ్‌బీ శాఖ అధికారులు తెలిపారు.