11-12-2024 12:00:00 AM
-కౌటిలీయం (చాణక్య)- 8.2.2
“రాజుకు అభ్యంతర కోపం అంటే రాజ్యంలో వచ్చిన తిరుగుబాటు, బాహ్య కోపం అంటే బయటి శత్రువుల నుంచి వచ్చిన ప్రమాదం. ఈ రెండూ ప్రధానమైన ప్రమాదాలు. పాము పగ లాంటిదైన అభ్యంతర కోపం బయటి దానికన్నా ఎక్కువ ప్రమాదకరమైంది.
అభ్యంతర కోపం కన్నా కూడా అమాత్యులవల్ల ఏర్పడే ప్రమాదం మరింత తీవ్రమైంది” అంటాడు చాణక్య. రాజ్యానికి రెండు ముఖ్యమైన అధికార కేంద్రాలు ఉంటాయి. ఒకటి రాజు లేదా నాయకుడు, రెండవది అమాత్యుడు. వీరిరువురి అధికారాలు పరస్పర ఆధారితాలు. ఒకటి లేక మరొక దానికి సంపూర్ణత చేకూరదు.
నాయకుడు మార్గ నిర్దేశన చేస్తాడు. అమాత్యుడు దానిని అమలు చేస్తాడు. కార్యాచరణలో అవసరమైన ఆలోచన, వ్యూహ రచన, దానిని పటిష్టంగా అమలు చేయడం అమాత్యుని బాధ్యత. ఆ బాధ్యతా నిర్వహణలో అవసరమైన అన్ని అధికారాలు ఆయనకు ఇచ్చినా కోశం, దండనాధికారం మాత్రం రాజు తన వద్దనే ఉంచుకోవాలి.
సంస్థలో అమాత్యుడు అంటే ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈవో) కీలకమైన వ్యక్తి. అతని ఆధ్వర్యంలోనే సంస్థ నిర్వహించే కార్యకలాపాలన్నీ వెలుగుచూస్తాయి. పటిష్టమైన, దోషరహితమైన, సమగ్ర కార్యాలోచన నిర్వహణాధి కారుల ప్రాథమిక అర్హతగా గుర్తింపు పొందుతుంది.
కార్యాచరణ అంతిమ ఫలితం నిర్వహణాధికారి నిర్దుష్టమైన, పరిణతమైన ఆలోచనా సరళిపైనే ఆధారపడుతుంది. సంస్థను ఎక్కడ నిర్మిస్తే ఉపయుక్తంగా ఉంటుంది? అక్కడి వసతులు, వనరులు ఎలాంటివి? ఆ వనరులు ఎంతవరకు ఉపకరిస్తాయి? ముడిసరకులు ఎంతకాలం సరిపోతాయి? యంత్ర సామాగ్రిని తరలించేందుకు అవకాశం ఉందా?
కార్యాలయాలకు, ఉద్యోగుల వసతికి భవనాదులు సరిపోతాయా? రహదారులు ముడిసరకును తెచ్చుకునేందుకు లేదా ఉత్పత్తులను పంపిణీ చేసేందుకు ఉపకరిస్తాయా? వాతావరణం సహకరిస్తుందా? నాణ్యత, నైపుణ్యం, నిబద్ధత కలిగిన ఉద్యోగులు లభిస్తారా? ఆర్థిక వనరుల అవసరం ఎంత? వాటిని ఎలా సమకూర్చుకుంటాం?
విపణి వీధిలో సంబంధిత ఉత్పత్తుల అమ్మకపు వెల ఎలా ఉంది? సంస్థ తట్టుకోగలదా?-ఇలాంటి అన్ని విషయా లనూ క్షుణ్ణంగా, లోతుగా, సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సంస్థ నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కారాలు, ప్రత్యామ్నాయాలను ఆలోచించుకోవడం, ప్రణాళికలను నివేదికల రూపంలో అక్షరబద్ధం చేసి వాటిని నిపుణులతో చర్చించడం, అవసరమైన మార్పులు చేర్పులతో సమగ్ర ప్రణాళికలు రచించుకోవడం..
నిర్వహణాధికారి బాధ్యత. తదుపరి లక్ష్యసాధనకై వ్యూహాన్ని రచించుకోవడమూ అవసరం. నమూనా ప్రణాళిక తయారైన పిమ్మట దానిని ఎలా అమలు చేయాలి? మధ్యలో వచ్చే ఇబ్బందులు, అడ్డంకులు ఏమిటి? బాహ్య ప్రత్యర్థులు ఎలాంటి అడ్డంకులు సృష్టించవచ్చు? అంతశ్శత్రువులు ఎలా స్పందించే అవకాశం ఉంది?
వాటిని ఎలా అధిగమించడం?.. వీటికి సంబంధించి సమగ్ర వ్యూహాన్ని తయారు చేసుకోవడం నిర్వహణాధికారి దక్షతను తెలుపుతుంది. కారణం ఏదైనా ఒక వ్యూహం ఫలించకపోతే ప్రత్యామ్నాయ ఆచరణాత్మక వ్యూహాన్ని అందుబాటులో ఉంచుకోవాలి.
లోపలి శత్రువులతో బహుపరాక్
ఆలోచనలు, వ్యూహాలు ఎంత గొప్పవైనా, వాటిని పటిష్టంగా అమలు చేయడంలోనే జయాపజయాలు నిశ్చిత మవుతాయి. సంస్థ విజయంలో ఉద్యోగుల పాత్ర ప్రముఖమైంది. సమర్థమైన ఉద్యోగుల బృందాలను ఏర్పరచి అవసరమైన శిక్షణల ద్వారా బృందాలను నవీకరించి, వ్యూహాలను పటిష్టంగా అమలు చేయడంలోనే నిర్వహణాధికారి దక్షత, పరిణతి వెలుగు చూస్తాయి.
సంస్థ ఎదుగుదలను అడ్డుకునే ప్రత్యర్థుల రూపంలోని బాహిర శత్రువులు ప్రమాదకారులే అయినా వారికి సంస్థ ఆంతరంగిక వ్యవహారాలు తెలిసే అవకాశం తక్కువ. అంతరంగిక శత్రువులకు ఆ అవకాశం ఉంటుంది. అందువల్ల బయట వారికన్నా లోపలి శత్రువుల వల్లనే ప్రమాదం ఎక్కువ. వీరిరువురి కన్నా నిర్వహణాధికారి వల్ల జరిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నాయకుడు నిర్వహణాధికారికి అధికారాలు ఎన్ని అప్పగించినా ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా తన నియంత్రణలోనే ఉంచుకోవాలి.
ఏయే పనులకై ఎంత ధనం ఖర్చుపెట్టాలి? ఎవరెవరికి ధనం ఇవ్వాలి? వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్వహణాధికారి ఆశ్రిత పక్షపాతంతో నిధులు దుర్వినియోగం చేసినా, సకాలంలో సరైన కార్యానికి నిధులు వ్యయించక పోయినా ఫలితాలు తారుమారై సంస్థ ఆర్థికం గా నష్టపోతుంది. అలాగే, ఎవరిని దండించాలో, ఎంతవరకు శిక్షించాలో తెలియకుండా తీవ్రంగా దండిస్తే ఉద్యో గులకు ఉద్వేగం, భయం, ద్వేషం కలుగుతాయి.
మృదువుగా దండిస్తే లోకువ అవుతారు. నిర్వహణాధికారి అసమ ర్థత వల్లనో లేదా స్వార్థపరత్వం వల్లనో అవసరానికి మించి శిక్షలు వేయకుండా, నిధులు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు వాటికి సంబంధించిన అంతిమ నిర్ణయాలు పూర్తిగా నాయకుడు తన పరిమితులలోనే ఉంచుకోవాలి. అప్పుడే అనుకున్న విజయాన్ని ఆస్వాదించగలరన్నది చాణక్య ధర్మం.