31-12-2025 12:16:31 AM
తెల్లవారుజామున వరకు గుట్టలు మాయం
సెలవు రోజుల్లో బిజీబిజిగా అక్రమార్కులు
రెవెన్యూ పోలీస్ అధికారుల వత్తాసు
బాన్సువాడ, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): రాత్రి పడితే చాలు మొరం మాఫియా రాత్రికి రాత్రి గుట్టలను గుటుక్కుమని మాయం చేస్తున్నారు. గ్రామ శివారులు పట్టణ శివారు లతోపాటు చెరువులు గుట్టలను తవ్వేస్తూ మొరం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. సెలవు దినాలతో పాటు రాత్రి వేళల్లోనూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టరాజ్యంగా మొరం తరలిస్తూ లక్షలాది రూపాయలను అర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ పరిధిలోని జుక్కల్ మద్నూర్ బిచ్కుంద పిట్లం పెద్ద కోడాప్గల్ నిజాంసాగర్ బీర్కూర్ నస్రుల్లాబాద్ నాగిరెడ్డిపేట్ ఎల్లారెడ్డి బాన్సువాడ, బీర్కూర్ కోటగిరి వర్ని చందూర్ పోతంగల్ రుద్రూర్ మోస్రా మండలాల్లో మొరం, మట్టి అక్రమ తరలింపు జోరుగా సాగుతుంది.అనుమతులు లేకుండా భారీగా మొరం తరలిస్తూ అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.
ఒకటి టిప్పర్ వంటి వాహనాలకు మొరం కు ప్రభుత్వం నుంచి ఒక టన్నుకు రాయల్టీ డిఎంఎఫ్, ఎస్‌ఎంటి, ఇతర పన్నులు అన్ని కలిపి ఒక టన్నుకు రూ.56 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒక టిప్పర్ కు సుమారు రూ. 900 రాయల్టీ చెల్లించాలి. కానీ ఇవేవీ లేకుండానే మొరo తరలింపు చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మొరం ఒక్కో టిప్పర్ ధర రూ 4000 నుండి 4500 వరకు విక్రయిస్తున్నారు.
రోజువారీగా సగటున బాన్సువాడ మండలం నుండే లక్షల్లో వాల్టా రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉండగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీ సొమ్ము, అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుండడంతో గుట్టలు స్వాహా చేస్తున్న మాఫియా పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు మొరం కావాలంటే సవా లక్ష నియమ నిబంధనలు పెట్టే అధికారులు. అక్రమ రవాణా చేసే వ్యాపారులకు ఎలాంటి నిబంధనలు వర్తించవు. సెలవు వచ్చిందంటే చాలు ఏ అనుమతులు ఉండవు. సర్కారుకు వాల్టా రాయల్టీ చెల్లించరు.
అయినా రాత్రి, పగలు అనే తేడా లేకుండా మొరం కొల్లగొడుతారు. ప్రభుత్వానికి ఎలాంటి వాల్టా రాయల్టీ చెల్లించకుండా అధికారులకు మచ్చిక చేసుకొని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట మోరం దందా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాన్సువాడ మండలం కొల్లూరు శివార్లలో, సోమేశ్వర్, దేశాయిపేట్, బుడిమి, జక్కల దాని తాండ కెనాల్ శివార్లలో గ్రామ శివారులోని గుట్టల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు కొనసాగుతున్నాయి.
టిప్పర్లలో నిత్యం వందల ట్రిప్పుల మొరాన్ని సోమేశ్వర్ శివారు ప్రైవేట్ వెంచర్, బాన్సువాడ లోని ప్రైవేటు వెంచర్లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. అక్రమ రవాణా రెవెన్యూ, పోలీస్ అధికారులకు తెలిసినప్పటికీ తెరవెనుక ఈ అక్రమ దందా అధికారులు సంపూర్ణంగా వ్యాపారులకు సహకరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ అక్రమ దందాకు అధికారులు అండగా ఉండడంతో మూడు పువ్వులు ఆరుకాయలుగా విరజిల్లింది.
దీంతో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఈ అక్రమ దందా కు వత్తాసు పలకడంతో వ్యాపారులకు ఈ అక్రమ దందా ద్వారా కాసులు వర్షం కురిపించేందుకే అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన అధికారులే ప్రభుత్వ గండి కొడుతున్న మాఫియాకు వత్తాసు పలుకుతూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
అధికారులకు ఏదైనా సమాచారం తెలుసుకు నేందుకు ఫోన్ చేస్తే మండల అధికారులు, జీపిఓలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం బట్టి చూస్తే అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉన్నదో ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండికోడుతూ మొరం తరలించే వారికి అండగా ఉన్న మండల ఆయా శాఖల అధికారుల పై జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇంత జరుగుతున్న రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తు న్నారని ఆరోపణలు ఉన్నాయి.
అక్రమార్కులు రాత్రిపూట తవ్వకాలు జరిపి గుట్టలను, చెరువులను మాయం చేస్తున్నారు. మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీకి చెందిన నాయకుల పేరు చెప్పి తవ్వకాలు చేపడుతున్నారు. మొరం మాఫియా ఆగడాలు మితిమీరడంతో వనరులు, వృక్ష సంపద కనుమరుగవుతున్నది.
ప్రభుత్వ ఆదాయానికి గండి
అనుమతులు లేకుండా సాగుతున్న మొరం వ్యాపారంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నది. మొరం వ్యాపారం చేయాలంటే మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకొని రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇవ్వాలనే నిబంధన ఉన్నది. కానీ బాన్సువాడ డివిజన్లో నిబంధనలను తుంగలో తొక్కి దర్జాగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అక్రమ మొరం,
మట్టి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ అధికారులు మామూలు తీసుకొని అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల పేరిట అధికారులకు తెలుపుతూ ప్రైవేటు వ్యక్తులు చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలు, వెంచర్లు ఇతరత్రా నిర్మాణాలకు రాత్రి సమయాల్లో మట్టి, మొరం విక్రయాలతో వ్యాపారం సాగిస్తున్నారు. మట్టి, మొరం అక్రమ తవ్వకాలను నియంత్రించాలని స్థానికులు పేర్కొంటున్నారు.
అక్రమార్కులతో అధికారుల కుమ్మక్కు
సెలవు దినాల్లో,రాత్రి వేళలో జరుగుతున్న అక్రమ మురం తవ్వకాలు రవాణాకు రెవిన్యూ పోలీస్ శాఖలో కొంతమంది అధికారులు కుమ్మక్కు అయినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు పోలీస్ శాఖ పనిలో ఎదుట నుండే అక్రమ మొరం రవాణా సాగుతున్న పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు సైతం పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు ఉన్నాయి.
ఇంత అక్రమ రవాణా జరుగుతున్న అటు రెవెన్యూ ఇటు పోలీస్ శాఖ నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కొంతమంది అధికారుల ప్రమేయం ఉండడంతోనే రాత్రి వేళలో అక్రమ రవాణా సాగుతుందని పలు విమర్శలు కూడా తావు ఇస్తుంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక బృందంతో తనిఖీలు చేపట్టి అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.