calender_icon.png 18 July, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకీ చిత్రం టైటిల్ ఇదేనా?

18-07-2025 12:36:43 AM

వైవిధ్యమైన కథలతో కుటుంబ ప్రేక్షకులను అలరించే టాలీవుడ్ స్టార్ వెంకటేశ్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ గత సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడీ విక్టరీ హీరో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పేదేమీ ఉండదు.

‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో సంచలన విజయాలు ఖాతాలో వేసుకున్న ఈ జోడీ మరోమారు వస్తోందని తెలిసినప్పట్నుంచీ అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేకుండాపోతోంది. వెంకటేశ్ గత రెండు చిత్రాలకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ తాజా చిత్రానికి మాత్రం తానే దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ కొత్త చిత్రానికి ‘వెంకటరమణ’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

టైటిల్ విషయమై ఇప్పుడు మరో ఆసక్తికర టాక్ వినవస్తోంది. ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కథకు ‘అబ్బాయి గారు 60+’ అనే టైటిల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం. గతంలో వెంకటేశ్ సరసన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాల్లో జత కట్టిన త్రిషను ఈ చిత్రంలో కథానాయికగా దాదాపు ఖాయం చేసినట్టేనని టాక్.

త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేశారని, ఇది పూర్తిగా కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని తెరకెక్కిస్తున్న వినోదాత్మక చిత్రమని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

ఓ మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలు, హాస్యం మేళవించిన కథతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలోనే పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇక షూటింగ్‌ను మూడు నుంచి నాలుగు నెలల కాలంలో పూర్తిచేసి, వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనతో టీమ్ ఉంది.