26-09-2024 12:00:00 AM
మానసిక ఒత్తిడి, ఫాస్ట్‌ఫుడ్ తినటం, శారీరక శ్రమ లేకపోవటం, వ్యాయామాన్ని పక్కనపెట్టేయడం... లాంటివి ఆరోగ్యానికి పెద్ద శత్రువులుగా మారుతున్నాయి. ఫలితంగా పిల్లల నుంచి పెద్దల వరకు గుండె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జీవనశైలికి బాగా ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే ఆరోగ్యకరమైన గుండె కోసం ఏం చేయాలి?
నిపుణులు ఏం చెబుతున్నారు?
ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దేశవ్యాప్తంగా ఏదో ఒకచోట ప్రతినిత్యం గుండెపోటు మరణాలు చోటుచేసు కుంటున్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు, కరోనా తర్వాత పెరిగిన మానసిక, శారీరక ఒత్తిళ్లు ఇలా అన్ని తోడై.. గుండె పనితీరును దెబ్బతిస్తున్నాయి. పది కాలాలు పదిలంగా ఉండాల్సిన హృదయం.. లయ తప్పి.. అర్థాంతరంగా ఆగిపోతున్నది.
యువకుల్లోనూ గుండె సంబంధిత వ్యాధులు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 51 శాతం మందిలో బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్, రక్తం గడ్డకట్టుకుపోవడం, నరాల సంబంధిత వ్యాధులు పెరుగుతున్నట్టు వైద్యుల పరిశీలనలో తేలింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 37 శాతం అత్యవసర వైద్యం కేసులు పెరిగాయని వెల్లడైంది. ఇందులో గుండె సంబంధిత వ్యాధుల బారినపడినవారి సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మంచి జీవనశైలితో..
ఆరోగ్యకరమైన హృదయానికి ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరం. లేదంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బిజీలైఫ్‌లో కచ్చితంగా నిద్రకు ప్రాముఖ్యం ఇవ్వాలి. రోజుకు ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా నిద్ర పోవాలి. స్లీప్ ఆప్నియా సమస్య ఉంటే నిద్ర సరిగ్గా పట్టదు.
అలాంటివాళ్లలో గుండె జబ్బుల రిస్క్ పెరుగుతోంది. గురక పెడుతున్నా సరే ఓసారి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం అవసరం. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. మద్యపానం మానేయాలి. అలాగే ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. లేదంటే ఆ ఒత్తిడి ప్రభావం గుండెపై పడి తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది.
రోజువారీ వ్యాయామం చేయాలి. ఇందుకోసం వేగవంతమైన నడక, లేదంటే మోస్తరు పరుగు, ఏరోబిక్ వ్యాయామాలు, స్విమ్మింగ్ చేయొచ్చు. అలాగే కొన్ని ఆహారాలు మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు నిపుణులు. “చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు.
కానీ నిజానికి ఇది మంచి అలవాటు కాదు. ఆహారం ఎక్కువ సేపు ఉండేందుకు ఫ్రిజ్ లో పెడుతుంటారు. అవి కూడా గుండె జబ్బులకు కారణమవుతాయి. కాబట్టి వాటికి బదులు బలమైన పోషకాలు బాడీకి అవసరం” అని అంటున్నాడు డాక్టర్ దీపక్.
* నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన మైథిలీ ఏడో తరగతి విద్యార్థిని. చదువుల్లో చాలా యాక్టివ్‌గా ఉండేది. అయితే హాస్టల్ నుంచి సెలవుల కోసం ఓరోజు ఇంటికి వెళ్లింది. సాయంత్రం వరకు హుషారుగా ఉన్న ఆ అమ్మాయికి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చి పడిపోయింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించేలోపు ఆ అమ్మాయి చనిపోయింది.
* హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన ఆదిత్యకు ఫిటెనెస్ అంటే ఇష్టం. బాడీ బిల్డప్ కోసం రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లేవాడు. ఓరోజు ఉదయం ఎప్పటిలాగే జిమ్ చేశాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఒంట్లో నలతగా ఉందని, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని జిమ్ ట్రైనర్‌తో చెప్పి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు జరగాల్సిన నష్టం జరిగింది.
ఇతర కారణాలు
మన శరీరంలో ప్రతీ భాగంలోని ప్రతి కణానికి రక్తం అందాలంటే గుండె నిర్ణీత ఒత్తిడితో దాన్ని పంప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కారణాలతో ఈ ఒత్తిడి పెరిగిపోతే దాన్ని అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్‌గా చెబుతారు. ఇలా అధిక రక్తపోటు దీర్ఘకాలం పాటు కొనసాగితే అది గుండెతోపాటు మూత్రపిండాలు సహా ఇతర ముఖ్యమైన అవయవాలకు నష్టం చేస్తుంది.
అందుకని వైద్యుల సూచనల మేరకు ఆహార, జీవన నియమాల్లో మార్పులు చేసుకోవాలి. సూచించిన ఔషధాలు వాడుకోవాలి. ఇక తమకు గుండె జబ్బుల రిస్క్ ఉందని తెలుసుకోవాలని అనుకుంటే.. అందుకు కుటుంబ ఆరోగ్య చరిత్ర కూడా ఓ ముఖ్యమైన సూచిక. తల్లిదండ్రులు, వారి తోడబుట్టినవారిని అడిగి వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో కూడా తెలుసుకోవడం మంచిది.
ఏం చేయాలంటే?
బీపీ, షుగర్, అధిక కొలెస్ట్రాల్ కలిగినవారు కనీసం ఆరునెలలకు ఒకసారి అయినా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఇవి లేనివారు ఏడాదికి ఒకసారి చేయించుకోవాలి. దీనివల్ల మన శరీరంలో చోటు చేసుకునే మార్పులను ఆదిలోనే గుర్తించి నియంత్రించుకోవటానికి అవకాశం ఉంటుంది.
కొందరైతే రక్తనాళాలు మూసుకుపోయినా, పూడికలు ఏర్పడి చివరి దశకు వచ్చినా గుర్తించడంలేదు. ఇలాంటి వారే ఆకస్మికంగా చనిపోతున్నారు. ఇవన్నీ నియంత్రించాలంటే తరుచూ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ఏదైనా పని చేస్తున్నపుడు గుండెపోటు వస్తే వెంటనే చేస్తున్న పని ఆపేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. అనుమానం ఉన్నపుడు సొంతంగా వాహనాన్ని నడుపుకొంటూ వెళ్లొద్దు. వీలైతే ఫ్యామిలీమెంబర్స్‌కు సమాచారం ఇవ్వాలి.
గుండెపోటు లక్షణాలు
ఛాతీలో నొప్పిని అసలు నిర్లక్ష్యం చేయొద్దు. అలా అని ఛాతీ భాగంలో వచ్చే ప్రతి నొప్పి కూడా గుండెకు సంబంధం ఉందనుకోవద్దు. ఛాతీలో తీవ్ర అసౌకర్యం, భారం, బరువు మోపినట్టు అనిపిస్తే అప్రమత్తం కావాలి. అలాగే అజీర్ణం, నొప్పి మెడ భాగం నుంచి చేతిలోకి పాకుతుండడం, గుండె దడ, తలతిరగడం, సొమ్మసిల్లి పడిపోవడం ఇవన్నీ కూడా గుండెకు సంబంధించినవే.
జంక్ ఫుడ్ వద్దు..
ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది జీవనశైలి మారింది. దాంతో ఒత్తిడి జీవితంలో భాగమైంది. ఒత్తిడి ఎక్కువైనప్పుడు బీపీ, షుగర్ ఎక్కువై గుండెపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి సరైన జీవనశైలి అవసరం. గుండె ఆరోగ్యం కోసం మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. డ్రైప్రూట్స్ బాదం, వాల్ నట్స్ రెగ్యులర్ తినాలి.
దాంతో ఒమెగా ఫ్యాట్స్ శరీరానికి అంది హార్ట్ హెల్దీగా ఉంటుంది. వెజిటబుల్స్‌లో బీకాంప్లెక్స్ న్యూట్రీషన్స్ కూడా హార్ట్‌కు ఎనర్జీనిస్తాయి. బత్తాయి, ఆపిల్, బొప్పాయి లాంటి పండ్లు మంచి మందులా పనిచేస్తాయి. అలాగే వాకింగ్ కచ్చితంగా చేయాలి. ఏదైనా రోగంతో బాధపడుతున్నట్లుతై... అలాంటివారు డాక్టర్‌ను సంప్రదించి తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
సైదా సన, డైటీషియన్
ఆరోగ్యకరమైన అలవాట్లు ముఖ్యం
చాలామంది చిన్న చిన్న సమస్యలకే ఆందోళన పడుతుంటారు. అలా ఆందోళనపడితే బీపీ వస్తుంది. బీపీ పెరిగేతే గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి కంగారు పడకుండా కాస్త కూల్‌గా ఉండాలి. టైం టు టైం భోజనం చేయాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి.
యోగా, ధాన్యం చేయడం వల్ల ఉద్రేకాలను అదుపులో పెట్టుకోవచ్చు. చాలామందికి ఈవిషయాలు తెలియక ఆందోళన చెందుతుంటారు. అలాంటివారు మొదటి హార్ట్ అటాక్‌తోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. సాత్విక ఆహారం చాలా అవసరం. వెజిటబుల్ ఫుడ్ మనసును తేలికగా ఉంచుతుంది
కే తిరుమల్ రావు, యోగా ట్రైనర్