calender_icon.png 12 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయపథంలో ఇస్రో

06-12-2024 12:00:00 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస ్థ(ఇస్రో) మరో మైలురాయిని చేరింది. సూర్యుడి బయటి పొర అయిన కరోనాను అధ్యయనం చేసేందుకు ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రోబా3 మిషన్ ప్రయోగం విజయవంతం అయింది. ప్రోబా3 మిషన్‌లో భాగంగా యూరోపియన్ స్పేస్ ఏజన్సీ అభివృద్ధి చేసిన రెండు ఉపగ్రహాలను   ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌నుంచి సీఎస్‌ఎల్‌వీసీ59 వాహక నౌక గురువారం సాయంత్రం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

సుమారు 550 కిలోల బరువున్న ‘కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్’్ట( సీఎస్‌సీ), ‘ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్’్ట(ఓ ఎస్‌సీ) అనే ఉపగ్రహాలను ‘ స్టాక్డ్ కాన్ఫిగరేషన్’లో అంటే ఒకదానిపై మరొకటి అమర్చి  రెండింటినీ కలిపి ఒకేసారి ప్రయోగించారు. వాణిజ్యపరంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమయినందుకు ఇస్రో చైర్మన్  సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు.

ఆరు దశాబ్దాల ఇస్రో సుదీర్ఘ ప్రయాణంలో ప్రారంభంలో అపజయాలు ఎదురైనా కుంగిపోలేదు. అచంచల విశ్వాసంతో విజయాలే లక్ష్యంగా ముందుకు సాగింది. ఆకాశమే హద్దుగా.. ఇస్రో విజయయాత్ర ముందుకు సాగుతూనే ఉంది. అంతరిక్ష పరిశోధనల్లో ఆరు దశాబ్దాలకు ముందు పరిస్థితి వేరు.

అమెరికా, రష్యా, చైనాలాంటి అగ్రదేశాలు మాత్రమే చంద్రుడి వంక చూడగలిగే ధైర్యం చేశాయి. కానీ భారత్ అచంచల దీక్షతో అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. రాకెట్ అంటే తెలియని స్థాయినుంచి చంద్రుడిని తాకిన క్షణం వరకు ఎన్నో ఒడిదుడుకులను తన ప్రయాణంలో ఇస్రో ఎదుర్కొంది. ఇప్పుడు వాణిజ్య పరంగా కూడా దూసుకెళ్తోంది.

ఆరు దశాబ్దాల ప్రయాణం 

ఒక్కొక్కటిగా పరికరాలను సమకూర్చుకుంటూ మన దేశం 1962లో  ‘ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్’ను ఏర్పాటు చేసుకుంది. ఇతర దేశాలతో కలిసి అంతరిక్ష పరిశోధనలు చేయడం ప్రారంభించాం. 1963లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ భారత్‌కు ఓ రాకెట్‌ను అందించింది. దాన్ని ఆ ఏడాది నవంబర్ 21న తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్‌నుంచి ప్రయోగించాం. 

1969లో ‘ఇస్రో’గా రూపాంతరం చెందాక విక్రమ్ సారాభాయ్, తర్వాతి కాలంలో సతీశ్ ధావన్, అబ్దుల్ కలాం అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించారు. మన శాస్త్రవేత్తలు తొలిసారి రూపొందించిన ఉపగ్రహం ‘ఆర్యభట్ట’. దీన్ని సోవియట్ యూనియన్‌నుంచి 1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు.

భారత్ విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహం ఇది. ఆ తర్వాత ‘రోహిణి’ ఉపగ్రహాన్ని 1980లో శ్రీహరికోటనుంచి ఎస్‌ఎల్‌వీ3 ద్వారా ప్రయోగించారు. 1972నుంచి 1984 మధ్య కాలంలో ఇస్రో ఎంతగానో అభివృద్ధి చెందింది. తొలి ఉపగ్రహం తయారీ, స్వదేశంనుంచి సొంత ఉపగ్రహం ప్రయోగం, లాంచింగ్ వెహికిల్ అభివృద్ధి చేసుకోవడం వంటి ఘనతలెన్నో సాధించింది.

‘ఇస్రో’ మైలురాళ్లు

1982లో భారతీయ ఉపగ్రహ వ్యవస్థలో తొలి శాటిలైట్ అయిన ‘ఇన్‌శాట్1ఏ’ను విజయవంతంగా ప్రయోగించింది. అన్నిటికన్నా మించి చంద్రుడిపై పరిశోధనలో ఇస్రో సాధించిన విజయాలు మైలురాళ్లుగా నిలిచాయి. చంద్రుడి ఉపరితలంపై నీటిలభ్యతను పరిశోధించడానికి 2008లో చేపట్టిన ‘చంద్రయాన్1’ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరో ఘనత సాధించింది.

ఆ తర్వాత 2019లో చంద్రయాన్2 ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రుడి ఉపరితలంపై దిగే సమయంలో ల్యాండర్ కాంటాక్ట్ కోల్పోవడంతో అది విఫలమయింది. అయితే 2023లో చంద్రయాన్3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. 

చంద్రయాన్3 సాధించిన విజయం ఇస్రోలోనూ, భారత భావి శాస్త్రవేత్తల్లోను కొండంత బలాన్ని అందించింది. అంతే దూకుడులో సూర్యుడిపై పరిశోధనల కోసం ‘ఆదిత్యఎల్1’ను ప్రయోగించి విజయాన్ని ముద్దాడింది. చంద్రయాన్4, చంద్రయాన్5కు కూడా శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. అలాగే భారత్, జపాన్ చేపట్టే సంయుక్త మిషన్ ద్వారా చంద్రుడిపైకి ప్రజ్ఞాన్ కంటే పెద్ద రోవర్‌ను పంపేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది ఇస్రో.

వాణిజ్య రంగంలోకి..

అటు వరస ప్రయోగాలతో దూసువెళుతూనే ఇస్రో అంతరిక్ష వాణిజ్యంలోకి కూడా అడుగుపెట్టింది.అతి తక్కువ ఖర్చుతో పాటు అత్యధిక సక్సెస్ రేటుతో దూసుకువెళ్తున్న ఇస్రో తోడ్పాటుతో ఉపగ్రహ ప్రయోగాలు జరపడానికి అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా పలు ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి.

ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను మన ప్రయోగ కేంద్రాలనుంచి ప్రయోగించడంకోసం 1992 సెప్టెంబర్‌లో ‘ఆంత్రిక్స్ కార్పొరేషన్’ పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ  ఏడాది జనవరిలో ఈ సంస్థ బ్రిటన్‌కు చెందిన  డీఎంసీ ఇంటర్నేషనల్ ఇమేజింగ్‌తోను, అలాగే ఫిబ్రవరిలో సింగపూర్‌కు చెందిన ఎస్‌టీ ఎలక్ట్రానిక్స్‌తోనే ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఈ ఉపగ్రహ ప్రయోగాలు ఈ ఏడాది చివరినుంచి వచ్చే ఏడాది చివరిలోగా జరగనున్నాయి. మరోవైపు కెనడా కూడా తన తాజా శాటిలైట్ ప్రయోగం కాంట్రాక్ట్‌ను ఆంత్రిక్స్‌కు ఇవ్వడానికి ఆసక్తితో ఉన్నామని ప్రకటించింది. ఇప్పటివరకు ఆంత్రిక్స్ 239 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా రూ.6,289 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది.

న్యూ స్పేస్ ఇండియా 

తాజాగా ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ అనే మరో విభాగాన్ని కూడా  ఏర్పాటు చేసింది. 2019 మార్చిలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ప్రధాన లక్ష్యం  భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం. ఈ రంగానికి చెందిన వివిధ ప్రైవేటు సంస్థలతో కలిసి ఇతర దేశాలకోసం ఉపగ్రహలను డిజైన్ చేయడంతో పాటుగా లాంచ్ వెహికిల్‌తో అనుసంధానం చేయడం వరకు అన్ని బాధ్యతలను  నిర్వహించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు.

ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ కింద పని చేస్తుంది. చిన్న చిన్న ఉపగ్రహాల తయారీ కోసం ఇస్రోతో పాటుగా ఆ శాఖనుంచి సబ్‌లైసెన్స్ కూడా పొందింది. అలాగే చిన్న ఉపగ్రహాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇతర దేశాలకు ఇది అందిస్తుంది.

ఈ సంస్థ ఇప్పటివరకు ‘ఒన్‌వెబ్’ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను తక్కువ ఎత్తు భూ కక్ష్యలో ఉంచడానికి సంబంధించి ఒక ఒప్పందం కూడా చేసుకుంది. గత ఏడాది ఆ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది కూడా. భారత సైన్యం అవసరాలు తీర్చడానికి అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం ‘జీశాట్7బీ’ కోసం రక్షణ శాఖ ఎస్‌ఎస్‌ఈఎల్‌తో రూ.3 వేల కోట్ల విలువైన ఒక ఒప్పందం చేసుకుంది.

అలాగే ‘ఏరియన్ స్పేస్’ లాంటి పలు అంతర్జాతీయ సంస్థలతోనూ ఉపగ్రహాల ప్రయోగం కోసం ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. తాజాగా జరిపిన ప్రోబా3 ఉపగ్రహ ప్రయోగాన్ని ఈ విభాగమే నిర్వహించింది. ఈ సంస్థల ఏర్పాటుతో ఇస్రో అంతర్జాతీయంగా అంతరిక్ష పరిశోధనా రంగంలో వాణిజ్య పరంగా కూడా ఓ ప్రధానమైన సంస్థగా నిలవడమ కాకుండా ఇతర అంతర్జాతీయ ఏజన్సీలకు పోటీ ఇస్తోంది.

రాబోయే సంవత్సరాల్లో ఈ వాణిజ్యం మరింత పెరిగి ఇస్రో ఆర్థికంగా బలపడడానికి, భవిష్యత్తు ప్రయోగాలు చేపట్టడానికి సైతం దోహదపడుతుంది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో ప్రపంచ దేశాలకు ఒక హబ్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ దిశగా ఇస్రోకు పూర్తి ప్రోత్సాహం అందించడంతో పాటు ప్రతి విదేశీ పర్యటనలోను అంతరిక్ష పరిశోధనలో ఆయా దేశాలతో కలిసి పని చేసే విషయంపై చర్చిస్తున్నారు. ఇస్రో మరింతగా విస్తరించడానికి ఇది ఎంతయినా దోహదపడుతుంది.

-కె. రామకృష్ణ