15-11-2025 08:45:26 PM
చిట్యాల,(విజయక్రాంతి): ప్రస్తుతం సమాజంలో బాలికలపై జరిగే ఆకృత్యాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐసిడిఎస్ మునుగోడు ప్రాజెక్టు డైరెక్టర్ సిడిపిఓ లావణ్య కుమారి అన్నారు. శనివారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, గుండ్రంపల్లి గ్రామాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగే భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా లింగ నిర్ధారణ, భృణ హత్యలు, బాల్యవివాహాలు, శిశు విక్రయాలు, గంజాయి, బాలికలపై జరిగే దాడులు వంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరి సిద్ధంగా ఉండాలన్నారు.
ముఖ్యంగా బాలికలు వారి తల్లిదండ్రులు ఇలాంటి చర్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అప్పుడే అలాంటి చర్యల నుండి వారిని వారు సంరక్షించుకోవడం జరుగుతుందన్నారు. బాలికలు ఏదైనా అభ్యంతరకర విషయాలపై 1098, 100,1908, 181 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయులు ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి, అంగన్వాడి టీచర్లు సుజాత, గీత, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.