05-05-2025 02:33:49 AM
ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్
జగిత్యాల అర్బన్, మే 4 (విజయక్రాంతి): సమాజంలోని ప్రతి ఒక్కరూ విధిగా సేవా భావాన్ని అలవర్చుకోవాలని ఆరెస్సెస్ కరినగర్ విభాగ్ సంఘ చాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న సంస్కార సాధన శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం జగిత్యాల వాల్మీకి ఆవాసం ఆవరణలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శంకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సేవా సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా విభాగం.. సేవా భారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సుమారు లక్ష 50 వేల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా జగిత్యాలలో ఏర్పాటుచేసిన వాల్మీకి ఆవాసం ద్వారా ఎంతోమంది గ్రామీణ, నిరుపేద విద్యార్థులను విద్యావంతులుగా, ఉత్తమ దేశభక్తి పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.
ఈ శిబిరంలో ఆరు కేంద్రాల నుండి 80 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారని, వీరికి యోగ, కరాటే, ఆటలు, దేశభక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యం, కోలాటం తదితర అంశాలలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సమాజంలో ఎంతోమంది సామాజికంగా, ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన వారు ఉన్నారని, వాటిని ఆదుకోవాల్సిన బాధ్యత తోటి సమాజంపై ఉందన్నారు.
ఈ సందర్భంగా విద్యార్తినీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక, శారీరక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వాల్మీకి ఆవాస అధ్యక్షులు జిడిగే పురుషోత్తం, ఉత్తూరి గంగాధర్, కంకనాల నీరజ, మదన్ మోహన్ రావు, తుంగూరి సురేష్, సంపూర్ణ చారి, సత్యం, గుండ సురేష్, బెత్తేపు లక్ష్మణ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.