22-05-2025 12:57:00 AM
మహబూబాబాద్, మే 21 (విజయ క్రాంతి): శాంతియుత ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ,10ఏండ్ల పాటు సుపరిపాలన అందించి, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ను సస్యశ్యామలం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.
మహానేత, గొప్ప పాలనాదక్షుడు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం తీవ్ర బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే గొప్ప ఎత్తిపోతల పథకం అని,ఇది ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, మొత్తం 3బ్యారేజీలు,15 రిజర్వాయర్లు,9 సబ్ స్టేషన్లు, 21పంప్ హౌస్ లు, 203 కిలోమీటర్ల టన్నెలింగ్ కెనాల్స్,1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 530మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోసే సిస్టమ్, 240 టీఏంసీల నీళ్ల వినియోగం కలదన్నారు.
మేడిగడ్డ మొత్తం 85పియర్స్ లో కేవలం మూడంటే మూడు కుంగిపోయినంత మాత్రాన ప్రాజెక్టు పూర్తిగా విఫలమైనట్టు కాదని, రాజకీయ దురుద్దేశంతో, కక్ష సాధింపు ధోరణితోనే నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు.
తెలంగాణలోని బీడు భూములకు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేయాలనే దృఢ సంకల్పంతోనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు.చార్మినార్ వద్ద చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి దేశం దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని, ఇది కాంగ్రెస్ ‘డైవర్షన్ పాలిటిక్స్’ లో భాగమే తప్ప మరొకటి కాదన్నారు.
అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు ఆడినా, దుష్ప్రచారం చేసినా యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, కేసులు బనాయించినా, వేధింపులకు దిగినా, కుట్రలు చేసినా బీఆర్ ఎస్ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటుందని రవిచంద్ర స్పష్టం చేశారు.