08-10-2025 12:19:02 AM
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా పానుగల్లులోని తెలంగాణ వారసత్వ శాఖ మ్యూజియంలో అపురూపమైన శిల్పాలు, శాసనాలు, పరికరాలు సేకరించి, భద్రపరచివున్నాయి. మ్యూజియం ప్రాంగణంలో నిలిపిన వీరశిలలలో ఏలేశ్వరం నుంచి తెచ్చిన, శాసనంతో కనిపించిన ఒక వీరశిలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు వోరుగంటి వేంకటేశ్ గుర్తించాడు.
ఈ వీరుడు కుడిచేత బల్లెం, ఎడమచేత డాలు ధరించి, డాకాలు ముందుమోపి శత్రువులను వధిస్తున్నాడు. అతని కాళ్ల నడుమ శత్రువీరుడు పడివున్నాడు. మరొకరు నిలబడి పోరుచేస్తున్నాడు. వీరుడికి కుడివైపు సిగ, కుండలాలు, హారగ్రైవేయకాలు, జంధ్యం, నడుమున దట్టీ, దండకడియాలు, కంకణాలు, కడియాలు, పాంజీబులు అలంకరించబడివున్నాయి.
ఈ వీరశిలపై చెక్కివున్న శాసనం 10వ శతాబ్దానికి చెందినదని, క్రీ.శ.996లో వేయించిన 21పంక్తుల తెలుగన్నడ లిపి, తెలుగు భాషా శాసనం వల్ల అరియరిమ్మ కుమార రాజ్యంలోని దవలందికి చెందిన మల్లయ కొమండివరదియ ఆనతి మేరకు కకయ్య అనే వీరుడు కాలి మడమ తిప్పకుండా యుద్ధం చేసి, వీర స్వర్గమలంకరించాడని తెలుస్తున్నది. ఈ శాసనాన్ని పవకోజు కొడుకు సరస్వత్త చెక్కాడని ఆ శాసనాన్ని చదివితే తెలుస్తున్నది.
శాసనపాఠం
1. సకవర్షంబు
2. లు 918 సం
3. వత్సర స్రాహి
4. శ్రీయ్యరియ
5. ఱిమ్మవరి
6. కొమరాజ్య దే
7. స దవలన్ది మ
8. ల్లయ కొమన్డీ వ
9. ఱడియ విలడి
10. పూనికి దప్ప కకయ్య
11. ననిడాద బొడిచి స
12. గ్గొమునకు జని
13. య
14. విరియన్న కొస
15. నమవడినిద
16. కొమ్మపయిని
17. వేఇంచిన ప
18. వకొజు నిరియ
19. ..రిమగడస
20. రస్వత్త చేసిన
21. పని