22-09-2025 01:13:07 AM
-ఐదో రోజూ కొనసాగిన సోదాలు
-సికింద్రాబాద్‌లోని కార్యాలయం సీజ్
-కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
-బినామీ లావాదేవీలు, నగదు అవకతవకలపై అధికారుల ఆరా
హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రముఖ బులియన్ ట్రేడింగ్ సంస్థ క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను ఐటీ శాఖ అధికారుల సోదాలు ఐదో రోజైన ఆదివారం కూడా కొనసాగాయి. భారీగా పన్ను ఎగవేత, నగదు లావాదేవీల్లో అవకతవకలు, బినామీల పేరిట వ్యాపారాలు సాగిస్తున్నారన్న పక్కా సమాచారంతో హైదరాబాద్, విజయవాడ, గుంటూరుతో సహా దేశంలోని పలు నగరాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి.
ఈ సోదాల్లో భాగంగా అధికారులు ఇప్పటికే పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఆవుల మంద ప్రాంతంలో ఉన్న క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు తమ సోదాలను ముగించారు. ఐదు రోజులుగా సాగిన ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకుని కార్యాలయాన్ని సీజ్ చేశారు.
గోల్డ్ స్కీములు, నగదు లావాదేవీల్లో అవకతవకలు
దాడుల్లో భాగంగా క్యాప్స్ గోల్డ్ అధినేతలు చందా శ్రీనివాస్, చందా అభిషేక్‌లను ఐటీ అధికారులు విచారించారు. ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ, తమ బంధువులను బినామీలుగా చూపి హైదరాబాద్, గుంటూరు, విజయవాడ వంటి పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న గోల్డ్ స్కీములు, నగదు లావాదేవీల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
శనివారం నాడు క్యాప్స్ గోల్డ్‌కు అనుబంధంగా ఉన్న క్యాసా జ్యువెలర్స్‌లో కూడా ఐటీ బృందాలు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని మహంకాళి స్ట్రీట్‌లోని కంపెనీ మరో కార్యాలయంలో సోదాలు ఇంకా కొనసాగాయి. దాడులు పూర్తయితే పన్ను ఎగవేతకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.