calender_icon.png 20 November, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ దాడులు

20-11-2025 12:00:00 AM

  1. పిస్తా హౌస్, మెహఫిల్, షాగౌస్ యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
  2. ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలు, ట్యాక్స్ చెల్లింపుల్లో తేడాలు గుర్తించిన అధికారులు 
  3. కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం
  4. వందల కోట్ల వ్యాపారం, విదేశాల్లోని బ్రాంచీలపైనా నజర్   

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఆదాయపన్ను శాఖ దాడుల ప్రకంపనలు రెండో రోజూ కొనసాగాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో నగరంలోని ప్రఖ్యాత హోటళ్లపై ఐటీ అధికారులు బుధవారం కూడా సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ తనిఖీలు పిస్తా హౌస్, మెహఫిల్, షాగౌస్ హోటళ్ల యజమానులు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ముమ్మరంగా సాగుతున్నాయి.

అవకతవకలు గుర్తించిన అధికారులు

మంగళవారం నాటి సోదాల్లో ఐటీ రిటర్న్స్‌లో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ యజమాని మహమ్మద్ మజీద్, అలాగే మహమ్మద్ అబ్దుల్ మోషీల ఇళ్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది నుంచి కూడా కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ట్యాక్స్ చెల్లింపుల్లో గణనీయమైన తేడాలు ఉన్నట్లు ఐటీ వర్గాలు గుర్తించాయి.

వందల కోట్ల వ్యాపారం.. విదేశాల్లోనూ బ్రాంచీలు..

ఈ హోటళ్లు ఏటా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయని, అయితే అందుకు తగ్గట్టుగా పన్నులు చెల్లించడం లేదని ఐటీ శాఖకు బలమైన ఆరోపణలు అందినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లోనూ ఈ హోటళ్లకు బ్రాంచీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వారి అంతర్జాతీయ లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని, స్వాధీనం చేసుకున్న పత్రాలు, హార్డ్ డిస్క్‌లను విశ్లేషిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీలు ముగిసిన తర్వాత పన్ను ఎగవేతకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.