24-01-2026 12:00:00 AM
మంత్రి అజారుద్దీన్‌కు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వినతి
మేడ్చల్, జనవరి 23 (విజయ క్రాంతి): మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 300 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు నుంచి మినహా యించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ కు వినతిపత్రం సమర్పించారు. 2024 నవంబర్ లో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీగా పేర్కొంటూ, సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908 కింద నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల, 76 కాలనీలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు.
ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు సంవత్సరాలుగా ప్రాపర్టీ టాక్స్ చెల్లిస్తున్నప్పటికీ, భూముల రిజిస్ట్రేషన్లు నిలిచి పోవడం, బ్యాంకుల ద్వారా గృహ రుణాలు మంజూరు కాకపోవడం, అత్యవసరాల కోసం అమ్మకం, గిఫ్ట్ డీడ్ వంటి లావాదేవీలు జరగకపోవడం వల్ల ప్రజలు ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారని తెలిపారు.
ప్రజల హితాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ భూములను సెక్షన్ 22A, రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908 పరిధి నుంచి తొలగించి, ఆస్తి యజమానులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి కాలనీ సంక్షేమ సంఘాల ప్రధాన కార్యదర్శి బి.టి. శ్రీనివాస్, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.