calender_icon.png 29 September, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటు

29-09-2025 12:22:03 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు  

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : గురుకులాలకు నిత్యవసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో హరీశ్‌రావును గురుకుల కాంట్రాక్టర్లు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెడితే గురుకులాలకు ఆహార పదార్థాలు ఎలా సరఫరా చేస్తారని, పిల్లలకు నాణ్యమైన భోజనం ఎలా అందిస్తారని ప్రశ్నించారు.

కల్తీ ఆహారంతో గురుకుల విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు వదులుతుంటే, ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయమన్నారు. గురుకుల విద్యార్థులు పస్తులుండకూడదన్న బాధ్యతతో కాంట్రాక్టర్లు అప్పులు తీసుకొచ్చి మరీ భోజనాలు పెడుతున్నారని, ఆ అప్పులు పెరిగి వారితోపాటు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నాయని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

సుమారు  ఐదువేల మంది సరఫరాదారులకు బతుకమ్మ, దీపావళి పండుగ సంబరం లేకుండా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారులను కలిసి బిల్లులు చెల్లించాలని గోడు వెల్లబోసుకుంటున్నా ఈ ప్రభుత్వానికి కదలిక లేదని ఆయన  విమర్శించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆరు నెలలుగా ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, గురుకుల పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని బీఆర్‌ఎస్ పక్షాన హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.