19-10-2025 12:29:59 AM
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కొత్త సినిమా ‘కే ర్యాంప్’. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తుండటంతో చిత్రబృందం థ్యాంక్స్‌మీట్ నిర్వహించింది. తమ సినిమా రివ్యూలు, రేటింగ్ విషయంలో కొందరు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
“ఎక్స్‌లో రివ్యూలు ఇచ్చే కొందరు.. కొన్ని సినిమాలకు త్వరగా రివ్యూ ఇస్తున్నారు. మరొకొన్ని సినిమాలకు సంబంధించి ముందు ఫస్టాఫ్ రివ్యూ ఇచ్చి, మూడు గంటల తర్వాత సెకండాఫ్ రివ్యూ ఇస్తున్నారు. మరికొన్ని సినిమాలకు ఫైనల్ రేటింగ్ ఎప్పటికో డిసైడ్ చేస్తున్నారు. ఇంత పక్షపాతం ఎందుకు? చిన్న నిర్మాత కదా.. ఏం చేసినా భరిస్తాడనేనా? నాలాంటి ఎంతోమంది నిర్మాతల సమస్య ఇది. ‘బాహుబలి’ అయినా, ‘కే ర్యాంప్’ అయినా సమీక్షకులు ఒకేలా చూడాలి” అని పేర్కొన్న రాజేశ్ దండా.. తమ సినిమా ప్రేక్షకులకు నచ్చిందని, వారే దాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ.. “నిజంగానే సినిమా బాగాలేకపోతే నేను సక్సెస్ మీట్ పెట్టను. ‘కే ర్యాంప్’ ఎలాంటి సినిమానో ముందుగానే చెప్పాం. దాన్ని దృష్టిలో పెట్టుకోనైనా పాజిటివ్‌గా చెప్తారేమోనని ఆశించాం” అన్నారు. దర్శకుడు జైన్స్ నాని మాట్లాడుతూ.. ‘సినిమాలో ఉన్న కంటెంట్‌కు, సోషల్‌మీడియాలో వచ్చే రివ్యూలకు పొంతనలేదని మా ఫ్రెండ్స్ అంటున్నారు” అని చెప్పారు.