06-12-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ చేపట్టిన భూముల వేలం ప్రక్రియ ఘనంగా ముగిసింది. గత కొన్ని రోజులుగా కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్ ప్రాంతాల్లో జరిగిన ఈ--వేలం ద్వారా హెచ్‌ఎండీఏ ఖజానాకు కనకవర్షం కురిసింది. గురువారంతో ముగిసిన ఈ మొత్తం సిరీస్ ద్వారా ప్రభుత్వం ఏకంగా రూ. 3,862.8 కోట్ల భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంది.
వేలం పాట చివరి అంకంలో భాగంగా గురువారం గోల్డెన్ మైల్‌లోని 1.98 ఎకరాల స్థలానికి వేలం నిర్వహించారు. వాస్తవానికి ఈ స్థలం ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ బిడ్డింగ్‌లో కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విజేతగా నిలిచింది. ఈ సంస్థ ఎకరాకు రూ. 77.75 కోట్లు వెచ్చించి ఈ స్థలాన్ని సొంతం చేసుకుంది.
స్థలం ఆకారం ఎలా ఉన్నా, లొకేషన్ డిమాండ్ కారణంగా ఇంత భారీ ధర పలికిందని అధికారులు తెలిపారు. ఈ వేలం ప్రక్రియకు ట్రాన్సాక్షన్ సలహాదారులుగా కుష్మాన్ , వేక్‌ఫీల్డ్ ,ఈ-ఆక్షన్ ప్లాట్‌ఫామ్‌గా ఎంఎస్‌టీసీ వ్యవహరించాయి. వచ్చిన ఆదాయం.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సత్తాను మరోసారి చాటిచెప్పింది.