28-07-2024 04:18:41 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పలు చెరిగారు. మోసాలు, అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అదే అబద్ధాలతో కాంగ్రెస్ పాలన సాగిస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టాలన్నా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకోలేదని జగదీష్ రెడ్డి గుర్తుచేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను ప్రజలను తప్పుదోవ పట్టించారని, సీఎం సభలో చదివింది ఉదయ్ పథకానికి సంబంధించినదని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం మాకు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని చెప్పారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేలా సీఎం చర్యలున్నాయని, స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులకు రేవంత్ రెడ్డి ఉరేసే ప్రయత్నం చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.