05-01-2026 02:12:24 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పీపీపీపై జగ్గారెడ్డి కామెంట్
అధికారంలో ఉంటే ఒకలా.. విపక్షంలోకి రాగానే మరోలా..
బీఆర్‌ఎస్ ద్వంద్వ రాజకీయం..
కేసీఆర్ తోలు తీస్తానంటే.. రేవంత్ నాలుక కోస్తానన్నాడు..
తప్పేముందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్య
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి) : ‘సాగు నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషనే కరెక్ట్ అని.. బీఆర్‌ఎస్ భవన్‌లో హరీశ్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్ బోగస్’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలోకి మారగానే మరోలా ద్వంద రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తోలు తీస్తా అంటే.. సీఎం రేవంత్‌రెడ్డి నాలుక కోస్తా అని అన్నాడు..అందులో తప్పేముందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉంటే బీఆర్‌ఎస్‌కు ఆంధ్రోళ్ల నీళ్ల దోపిడీ గుర్తుకు రాదు.. ప్రతిపక్షంలోకి రాగానే దోపిడీ గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.‘ కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆంధ్రోళ్ల పంచాయితీ తెరమీదకు వస్తుంది..? చంద్రబాబు హయాంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రోళ్లతో పంచాయతీ లేదు. ముఖ్యమంత్రులుగా కేసీఆర్, చంద్రబాబు కలిస్తే తప్పులేదు. కేసీఆర్-, జగన్ సీఎం హోదాలో కలిస్తే ఒప్పుగానే ఉంటుంది. కానీ, చంద్రబాబు-, రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో కలుసుకుంటే తప్పా’..? అని జగ్గారెడ్డి నిలదీశారు. రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి వస్తే కేసీఆర్ కూడా టీడీపీ నుంచే వచ్చారు కదా..? అని ప్రశ్నించారు.
వంద ప్రాజెక్టులు కట్టినా చెప్పుకోలే..
ఒక్కటి కట్టి వందల సార్లు..
తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీడీపీతో టీఆర్‌ఎస్ పొత్తుపెట్టుకున్నప్పుడు హరీశ్‌రావు తెలివి ఎటుపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన మంజీరా-, సింగూరు ప్రాజెక్టుల నీళ్లు తాగే కేసీఆర్, హరీశ్‌రావు పెరిగారనే విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. రూ. 7,600 కోట్లు ఖర్చు పెడితే కృష్ణానదిపై కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రశ్నించినందుకే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, ఆ తర్వాత రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాట్లాడేందుకు సమయం కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ హయాంలో వంద ప్రాజెక్టులు కట్టి ఒక్కసారి చెప్పుకోలేదని, కానీ, మీరు ఒక్క ప్రాజెక్టు కట్టి వందలసార్లు చెప్పుకుంటున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు మంత్రి అయ్యాకనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్లు, కాళేశ్వరంతోనే తాగునీరు వచ్చినట్లుగా తెలంగాణ భవన్‌లో చెబుతున్న విషయాలను.. అసెంబ్లీలో ఎందుకు చెప్పడం లేదని జగ్గారెడ్డి నిలదీశారు.