01-10-2024 12:00:00 AM
ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృ త్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది అంతే కాకుండా ఆ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును చట్టసభలో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అయితే ఈ జమిలి ఎన్నికలపై భారతదేశంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఎన్డీఏ, దాని మిత్ర పక్షాలు సమర్థించినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్,ఇండియా కూటమి నేతలు ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా యి. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని అస్థిరపరచడానికే బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటుందని డీఎంకే, టీఎంసీ లాంటి ప్రధాన ప్రాంతీయ పార్టీలు పేర్కొంటున్నాయి. అయితే భారతదేశ ఎన్నికల చరిత్రలో 1951 నుంచి 1967 వరకు లోక్ సభ, అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారిజరిగాయి. 1967 తర్వాత ఫిరాయింపు రాజకీయాలు మొదలు కావడం,కాంగ్రెస్ పార్టీలో చీలికలు రావడంతో ఈ జమిలి ఎన్నికల విధానం రద్దయింది.
పస లేని బీజేపీ వాదన
అయితే ఈ జమిలి ఎన్నికలపై 1999లో జస్టిస్ బీ.పీ జీవన్ రెడ్డి నాయకత్వంలోని లా కమిషన్ సిఫారసు చేసింది. ఆ తర్వాత 2018లో 21వ లా కమిషన్,నీతి అయోగ్, ప్రతి రెండున్నర సంవత్సరాలకు రెండు దశల్లో ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడింది. జమిలి ఎన్నికలను కచ్చితంగా నిర్వహించి తీరుతామని బీజేపీ ముందు నుండి చెపుతూ వస్తున్నది.
అంతే కాకుండా తన ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పేర్కొంది. జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ఖర్చు, నిర్వహణ, భద్రత పరమైన అవరోధాలు లేకుండా ఉంటుందని, అంతే కాకుండా పాలనాయంత్రంగానికి అడ్డంకులు రాకుండా పాలన నిర్వహణకు వీలవుతుందని బీజేపీ నేతలు చెపుతున్నారు.
ఒకవేళ నిజంగానే జమిలి ఎన్నికలు 28 రాష్ట్రాల్లో ఒకే సారి నిర్వహించి ఆ తర్వాత ఏదై నాలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడి రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్ర శాసనసభ రద్దయితే అప్పుడు మిగిలిన మూడేళ్ల కాలానికి మళ్ళీ ఎన్నిక నిర్వహించాలని కొవింద్ కమిటీ సిఫారసు చేసింది. మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే అది ఏ విధంగా జమిలి ఎన్నిక అవుతుంది.
రెండు సంవత్సరాల తర్వాత రద్దైన శాసన సభకు మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ఏ విధంగా ఖర్చు ఆదా అవుతుంది. ఆ నాలుగు రాష్ట్రాల తర్వాత ఇంకేదైనా రాష్ట్రంలో పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే ఆ రాష్ట్ర శాసన సభ అవిశ్వాస తీర్మానంలో బల నిరూపణ చేసుకోకుండా ప్రభుత్వం రద్దైతే అప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు భారం పెరగదా? నిర్వహణ సమస్యలు ఉండవా? అనేది బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి.
ఒకవేళ ఖర్చు అవుతుందని ఎన్నికలు నిర్వహించకుండా మిగిలిన కాలానికి రాష్ట్రపతి పాలన పెడితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అది రాజ్యాంగానికి విరుద్ధం కాదా..? నిజంగా బీజేపీ భావించినటు ్లప్రజా ధనాన్ని కాపాడాలి అని అనుకుంటే మరి జమ్మూ కాశ్మీరు, హర్యానా, మహారాష్ట్రల్లో ఎందుకని ఒకే సారి ఎన్నికలు నిర్వహించట్లేదు?
ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం కోసమే..
ఎందుకంటే ఈ జమిలి ఎన్నికలకు ము ఖ్య కారణం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక ఉత్తర ప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలం గా ఉన్న చోట బీజేపీ అధికారంలోకి రాలేక పోతున్నది. కాబట్టి ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను అస్థిర పరచ డానికే దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు ఆయా రాష్ట్రాలకు వరాలు హామీలు ఇచ్చేవి. కానీ ఒకే దేశం ఒకే ఎన్నికలతో అవి కూడా వచ్చే అవకాశం లేకుండా పోతుంది.
ప్రపంచంలోనే అగ్రగామి దేశం అయినటువంటి అమెరికాలో నాలుగేళ్లకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఎన్నికలు, గవర్నర్ ఎన్నికలు, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని ఇన్ని దశలలో ఎన్నికలు నిర్వహిస్తుంది. అలాంటి అగ్ర రాజ్యానికి లేనటువంటి ఇబ్బంది భారత దేశానికి ఏం వచ్చింది? అమెరికాలో మాత్రమే కాదు భారత్, చైనా తర్వాత అతిపెద్ద మూడవ దేశం దాదాపుగా పదిహేడు వేల దీవులు కలిగిన ఇండోనేషియా లాంటి దేశంలో ఒకే రోజులో ఎన్నిక నిర్వహిస్తారు, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఇజ్రాయెల్ లో కూడా ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే విధానం లేదు. ఎన్నో సార్లు ప్రభుత్వాలు వెంట వెంటనే మారిన దాఖలాలు ఎన్నో చూస్తున్నాం .
బీజేపీ చెప్తున్న మరో ముఖ్యమైన అంశం భద్రత పరమైన నిర్వహణ. అదే నిజమని భావిస్తే ఎందుకని ఏడు ఎనిమిది దశల్లో నిర్వహిస్తున్నారు. ఒకే దశలో నిర్వహించవచ్చు కదా? 1977 నుండి 1989 వరకు జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికలను కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఎలా జరిపారు? తొంభై దశకంలో పంజాబ్ లో వేర్పాటు వాదం తీవ్ర రూపంలోఉన్నా ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు రాకుండా నిర్వహించిన అనుభవం ఉంది కదా? అనేక దశల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజకీయ లబ్ధి కూడా ఉంది కదా.
జమిలి ఎన్నికల వల్ల పాలన ఒకే దగ్గర కేంద్రీకరించి పాలన చేయాలని బీజేపీ కోరుకుంటుంది. బీజేపీ విధివిధానాల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. పాలన కేంద్రీకృతం కావడం వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. దేశంలో నియంతృత్వం పోకడలు వచ్చే అవకాశం ఉంటుంది.
రాజ్యాంగ సవరణల మాటేమిటి?
ఇక జమిలి ఎన్నికలు చట్టం కావాలి అంటే ముఖ్యంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకు సగం రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. లోక్ సభ రాజ్యసభల్లో ఎన్డీఏకు ఇప్పుడున్న్న సొంత బలం సరిపోదు. రాజ్యాంగ సవరణలకు 2/3 వంతుల మెజారిటీ పార్లమెంటులో అవసరం. ముఖ్యంగా 1951 ప్రజా ప్రతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది.
ఈ చట్టం దేశంలో రాషాల్లో నిర్వహించే ఎన్నికల విధి విధానాలను తెలుపుతుంది. అంతేకాకుండా లోక్ సభ రాజ్యసభ కాల పరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83ను, రాష్ట్రాల అసెంబ్లీకి ఐదు ఏళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172 (1) ని సవరించాలి.
దానితో పాటుగా అత్యయిక పరిస్థితి సమయంలో సభా కాల పరిమితిని సంవత్సరానికి మించకుండా పార్లమెంట్ చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83 (2) బి సవరణ అవసరం అలాగే రాష్ట్రపతికి లోక్ సభను రద్దు చేసే ఆర్టికల్ 85 (2) బి సవరణతో పాటు రాష్ట్ర అసెంబ్లీల రద్దుచేసి గవర్నర్ కు దాఖలు పరిచే ఆర్టికల్ 174 (2) బి సవరణ అదేవిధంగా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు విలు కల్పించే ఆర్టికల్ 356 మరియు ఎన్నికల కమిషన్ కు సంబంధించిన ఆర్టికల్ 324 తో పాటు మొత్తంగా పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు అవసరం.
దీనికోసం పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు 293 ఎంపీల బలం ఉంది. అయితే జమిలి ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది అంతేకాకుండా రాజ్యసభలో ఎన్డీఏ బలం 121 కాగా జమిలి చట్టం ఆమోదం పొందడానికి 164 మంది ఎంపీల మద్దతు అవసరం.పార్లమెంటరీ పాలనతో పాటు సమాఖ్య వ్యవస్థ కలిగిన భారత దేశంలో పార్లమెంటుతో పాటు దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి అవుతుంది.
గతంలో బీజేపీ తెచ్చిన పెద్ద నోట్ల రద్దు, రైతు చట్టాలు చాలా నిర్ణయాలు ఎంతో గందరగోళం సృష్టించాయి ఇప్పుడు తాజాగా జమిలి జాతీయ సమైక్యతను కాపాడుతుందో ఏ విధంగా రాజకీయ మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.
భరత్ చౌహాన్
సెల్: 9030666999