31-01-2026 01:45:23 AM
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి) : తెలంగాణ నీటి హక్కుల విషయం లో రాజీపడే ప్రసక్తే లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం- లేదా నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్, ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ కూడా తమకు రాతపూర్వక వివరణ ఇచ్చారని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి చుక్క నీటిని కాపాడుకోవడానికి చర్చలకు సిద్ధమే కానీ, ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరు ద్ఘాటించారు. శుక్రవారం మంత్రి ఉత్తమ్ జూమ్ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ బనకచర్ల, నల్లమల సాగర్ ప్రాజె క్టులకు డీపీఆర్ కాదు కదా, కనీసం ప్రీ-ఫీజబిలిటీ రిపోర్ట్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
కేవలం రాజకీ య ఉద్దేశాలతోనే బీఆర్‌ఎస్ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయపె డుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన తాజా సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు తమ వాదనను బలంగా వినిపించారని మంత్రి తెలిపారు. నల్లమల సాగర్ ప్రాజెక్టును ఎజెండాలో చేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం ఒప్పుకోలేదని, కేవలం అంతర్రాష్ట్ర జల వివాదాలపై చర్చించడానికి మాత్రమే మొగ్గు చూపామని ఆయన వివరించారు. బీఆర్‌ఎస్ చేస్తున్నవన్ని అబద్ధ్దాలనేనని మంత్రి వ్యాఖ్యా నించారు.
ఆదిత్యానాథ్ దాస్ సమర్థవంతమైన అధికారి..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు ఏళ్లలోనే కష్ణా, గోదావరి బేసిన్లలో గత పదేళ్ల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని, రికార్డు స్థాయిలో వరి సాగు జరిగిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణను భారతదేశంలోనే నంబర్ వన్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్‌గా నిలిపింది తమ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.
ఇరిగేషన్ శాఖలో గత పదేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు, బదిలీలు, నియామకాలను పూర్తి చేసి శాఖ ను ప్రక్షాళన చేశామన్నారు. ఆదిత్యా నాథ్ దాస్ వంటి సమర్థవంతమైన అధికారుల సలహాలతో తెలంగాణ నీటి హక్కులను కాపాడటానికి తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, బీఆర్‌ఎస్ నేతలు చేసే అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు.
పదేళ్లలో ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారు..
ప్రాజెక్టుల గురించి బీఆర్‌ఎస్ నేతలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని మంత్రి ఉత్తమ్ అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. రూ. 1.8 లక్షల కోట్లు ఖర్చు చేసినా, పాలమూరు -రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టుల ద్వారా కనీసం ఒక్క ఎకరాకు కూడా కొత్తగా నీరు ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అప్పులు చేసి, చివరకు మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయే పరిస్థితికి తెచ్చారని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం డిజైన్, కట్టడం, కూలడం బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, దేవాదులు, ఎస్‌ఎల్బీసీ టన్నెల్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కేవలం దోపిడీ వ్యవస్థగా మార్చారని విమర్శించారు. పార్లమెంటులో ఆర్థిక సర్వే గణాంకాలను ప్రస్తావిస్తూ, కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టు కూడా కొత్తగా రాలేదన్నారు.
కృష్ణాలోని 810 టీఎంసీలకు గాను తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే చాలని, ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ సంతకం చేశారని మండిపడ్డారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించి.. రాయలసీమను రతనాల సీమగా చేస్తానని రోజా ఇంటిలో భోజనం చేశాక కేసీఆర్ ప్రకటించారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు తమ ప్రభుత్వం కృష్ణాలో 70 శాతం నీటి వాటా కోవాలని పోరాటం చేస్తోందన్నారు.