calender_icon.png 31 January, 2026 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ పోటీ

31-01-2026 02:24:07 AM

కత్తెర గుర్తుపై పోటీకి సిద్ధమైన పార్టీ

అభ్యర్థులకు బీఫారాలు ఇస్తున్న పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జనవరి 30(విజయక్రాంతి): రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) పూర్తి స్థాయిలో సిద్ధమైంది. పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో టీఆర్పీ కత్తెర గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు బీఫారాల పంపిణీ కార్యక్రమం ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ, టీఆర్పీ ఎన్నికల సన్నద్ధతను చాటింది. పక్కా వ్యూహాలతో, ప్రజా సమస్యలపై దమ్మున్న మేనిఫెస్టోతో టీఆర్పీ ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తోంది.

పట్టణాల్లో నెలకొ న్న డ్రైనేజీ సమస్యలు, తాగునీటి కొరత, రోడ్ల దుస్థితి, చెత్త నిర్వహణ వైఫల్యం, మున్సిపల్ పాలనలో అవినీతి వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఇది సాధారణ మున్సిపల్ ఎన్నిక కాదు.. ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం. డ్బ్బు ఏళ్లుగా బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న పార్టీలకు ఈ ఎన్నికలే గుణపాఠం చెప్పబోతున్నాయని స్పష్టం చేశారు.

బీసీలకు రిజర్వేషన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఆ హామీని అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై టీఆర్పీ ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా ఎండగడుతుందని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్  చేసిన ద్రోహాన్ని ప్రతి వార్డు, ప్రతి గల్లీలో ప్రజలకు వివరిస్తామని మల్లన్న తెలిపారు.  బీసీల హక్కుల కోసం టీఆర్పీ చివరి వరకు పోరాడుతుంది అని తెలిపారు.టీఆర్పీ మేనిఫెస్టో ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిందని, అవినీతికి తావు లేని పాలన అందించడమే లక్ష్యమని మల్లన్న పేర్కొన్నారు.