calender_icon.png 31 January, 2026 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్ముడు చూపిన బాటలో నడవాలి

31-01-2026 02:24:16 AM

  1. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు పుణికిపుచ్చుకోవాలి
  2. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని శుక్రవారం నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లంగర్ హౌస్‌లోని బాపు ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో గాంధీజీకి రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఘనంగా నివాళులర్పించింది.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇతర ప్రముఖులతో కలిసి బాపు సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీజీ దేశానికి చేసిన త్యాగాలను, ఆయన చూపిన శాంతి,అహింసా మార్గాన్ని స్మరించుకున్నారు. సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం సర్వమత ప్రార్థన కార్యక్రమంలో గవర్నర్, డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మృత్యర్థం ప్రముఖులందరూ కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.గాంధీజీ ఆశయాలను పుణికిపుచ్చుకో వాలని, అప్పుడే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఈ సందర్భంగా వక్తలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్సీ , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పాల్గొన్నారు.

వీరితో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు,స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, అడిషనల్ సీపీ తాప్సీర్ ఇక్బాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పర్యాటక, ఆర్ అండ్ బీ, వైద్య, విద్యుత్, విద్యా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరై అంజలి ఘటించారు. బాపు ఘాట్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించింది.