calender_icon.png 31 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊపిరాడని నగరం!

31-01-2026 02:00:19 AM

  1. హైదరాబాద్‌లో కోరలు చాస్తున్న కాలుష్యం
  2. బెంగళూరు, చెన్నైలను మించిపోయింది! 
  3. మోగుతున్న డేంజర్ బెల్స్.. పీసీబీ నివేదికలో దిగ్భ్రాంతికర నిజాలు 
  4. అనుమతించిన స్థాయి కంటే
  5. నాలుగు రెట్లు అధికంగా ధూళి కణాలు

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 30 (విజయక్రాంతి) : హైదరాబాద్ ఒకప్పుడు ఉద్యానవనాలకు ప్రసిద్ధి. ఎటు చూస్తే అటు చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని గాలులు. హైదరాబాద్ మహానగర వాతావరణం ఇప్పుడు మారింది. భాగ్యనగరం నెమ్మదిగా గ్యాస్ ఛాంబర్‌గా మారుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తాజాగా విడుదల చేసిన గణాంకాలు నగరవాసులను వణికించేలా ఉన్నాయి.

అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం, విపరీతంగా పెరిగిన వాహనాల రద్దీ వెరసి.. నగరంలో కాలుష్యం బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలను వెనక్కి నెట్టేసింది. గాలి నాణ్యత సూచీ పడిపోవడంతో నగరంలో శ్వాస పీల్చుకోవడం కూడా సాహసంగా మారుతున్నది.

అనుమతించిన స్థాయి కంటే 4 రెట్లు ప్రమాదం

నగరంలోని గాలిలో పీఎం 2.5, పీఎం 10 సూక్ష్మ ధూళి కణాలు స్థాయిలు సాధారణం కంటే 3 నుంచి 4 రెట్లు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం జరుగుతున్న ఫ్లుఓవర్ పనులు, అడ్డూఅదుపు లేని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, నిరంతరం రోడ్డెక్కుతున్న లక్షలాది వాహనాలు నగరాన్ని దుమ్ము మేఘాల కిందికి నెట్టేస్తున్నాయి.

వైద్యుల హెచ్చరిక..

గాలి నాణ్యత పడిపోవడంతో నగరవాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్తమా, అలర్జీలు, కంటి సంబంధిత సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు ఈ విషపూరిత గాలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుండటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో ప్రస్తుత పరిస్థితి దష్ట్యా బయటకు వెళ్లే సమయం లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే.. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులను బయటకు తీసుకురావద్దని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోకపోతే, హైదరాబాద్ నివాసయోగ్యం కాని నగరంగా మారే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నగరంలో 7 హాట్‌స్పాట్లు..

కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉన్న ఏడు ప్రాంతాలను పీసీబీ ప్రత్యేకంగా గుర్తించింది. ఇక్కడ గాలి నాణ్యత అత్యంత దారుణంగా ఉంది

సనత్‌నగర్ : పారిశ్రామిక పొగ, రసాయన వ్యర్థాలు.

పంజాగుట్ట : నిరంతర వాహనాల రద్దీతో వెలువడే కార్బన్ మోనాక్సైడ్

ఉప్పల్ :      భవన నిర్మాణ పనులతో కమ్ముకుంటున్న ధూళి

చార్మినార్ :  ఇరుకైన రోడ్లు, వాహనాల పొగతో ఉక్కిరిబిక్కిరి

జీడిమెట్ల :    రసాయన పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు

కేపీహెచ్‌బీ, మలక్‌పేట : భారీ వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ జామ్స్