calender_icon.png 31 January, 2026 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదంలో మేడిగడ్డ

31-01-2026 01:34:53 AM

అత్యంత ప్రమాదకర డ్యాముల జాబితాలో బ్యారేజీ

శషభిషలు వద్దు.. సర్కారే పూనుకోవాలంటున్న నిపుణులు

మరమ్మతులు చేయకుంటే పెను ముప్పే

  1. కాంట్రాక్టరుతో పోరాటంపై పెదవి విరుపులు
  2. నాణ్యత, డిజైన్లు, నిర్మాణం, బిల్లుల చెల్లింపుల్లో తప్పులు చూపని ఇంజినీర్లు 
  3. కంప్లీషన్ సర్టిఫికెట్, పెర్ఫార్మెన్స్ గ్యారెంటీ ఇచ్చింది కూడా సర్కారే 
  4. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు కూడా నిలిచేనా?

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి):  మేడిగడ్డ... ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశమైన అంశం. కేంద్రం తాజాగా విడుదల చేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ స్పెసిఫైడ్ డ్యామ్స్ (ఎన్‌ఆర్‌ఎస్‌డీ)లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న డ్యాము (కేటగిరీ-1)లో దేశ వ్యాప్తంగా కేవలం మూడంటే మూడు డ్యాములు ఉండగా.. అందులో మేడిగడ్డకూడా ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లోయర్ ఖజూరి డ్యాం, జార్ఖండ్‌లోని బొకారో బ్యారేజ్‌లతోపాటు కేవలం నాలుగైదు ఏళ్ల క్రితమే నిర్మించిన మేడిగడ్డ డ్యాం ఉండటంపై తక్షణం ప్రభుత్వం స్పందించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది.

సాధ్యమయ్యేనా...

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేసిన ఎల్‌అండ్‌టీ సంస్థతో న్యాయపోరాటం అంటే అన్ని రకాల అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుంది.  కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల డిజైన్లు, డ్రాయింగులను ప్రభుత్వమే సరఫరా చేసింది. నిర్మాణ పనులు చేస్తుండగా.. ఏ ఒక్కనాడు కూడా పనుల్లో నాణ్యతలోపం ఉన్నట్టుగా ఎక్కడా.. ఒక్క ఇంజనీరుకూడా రాతపూర్వకంగా రికార్డు చేసిన దాఖలాలు లేవు. బిల్లు లు చేసేటప్పుడు కూడా తప్పుడు బిల్లులు పెట్టినట్టుగా, ఇతర పనులు చేసినట్టుగా ఎక్కడా చెప్పినట్టు.. ఎందులోనూ లేదు.

బిల్లులు చెల్లించేటప్పుడు కూడా ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలూ లేవు. పైగా ప్రాజెక్టు కంప్లీషన్ సర్టిఫికెట్‌తో పాటు.. పెర్ఫార్మెన్స్ గ్యారంటీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి చేతు లు దులుపుకుంది. అంటే ఏ ఒక్క కోణంలోనూ సదరు కాంట్రాక్టు సంస్థను గతంలోనే నిలదీశాం.. వాటి తప్పొప్పులను ఎత్తిచూపాం.. ఫలానా చోట అభ్యంతరం తెలిపాం అనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇప్పుడు మరమ్మతులు చేయమంటే వ్యాపార కోణంలో పనిచేసే కాంట్రాక్టు సంస్థ చేస్తుందనే నమ్మకం లేదు.

ఇక క్రిమినల్ కేసు నమోదు చేసి.. న్యాయపోరాటం చేద్దామని ప్రయత్నించినా.. అదెంతకాలం సాగుతుందో.. ఏం ఫలితం వస్తుందనేదానిపై నమ్మకం కలగడం లేదు. కానీ ఇంతలోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందేమోననే ఆందోళన మాత్రం సర్వత్రా నెలకొంది. కారణం.. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎలాంటి అభ్యంతరం తెలపకుండా.. ఇప్పుడు మీదే తప్పు.. మీ ఖర్చులతోనే మరమ్మతులు చేయాలని అంటే.. వాస్తవాలు మనల్ని వెక్కిరిస్తాయేమో అనే అనుమానాలు మొదలవ్వక మానవు.

ఎందుకంటే.. గతంలో ఎప్పుడూ కూడా కాంట్రాక్టు సంస్థ తప్పు చేసిందని, ఎత్తిచూపినట్టు గానీ, అభ్యంతర చెప్పినట్టుగానీ ఎక్కడా లేదు. దీనితోనే న్యాయపోరాటం చేసినా.. మా ర్గాలు అన్నీ మూసుకుపోయే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

మరమ్మతులు చేపట్టకుంటే..

తాజాగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ స్పెసిఫైడ్ డ్యామ్స్ (ఎన్‌ఆర్‌ఎస్‌డీ)ని పరిశీలిస్తే.. దేశ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న మూడు డ్యాముల్లో మేడిగడ్డ ఉండటం అందోళనకరం. తక్షణం మరమ్మతులు చేయకపోతే.. దాని అస్థిత్వానికే ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ)కూడా స్పష్టం చేయడం గమనార్హం. అంటే ఇప్పటికిప్పుడు స్పందించి తక్షణ మరమ్మతులు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితిలో మేడిగడ్డ ఉంది.

సమయం లేదు.. 

ప్రీ మాన్‌సూన్, పోస్ట్ మాన్‌సూన్‌లో మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తరువాత.. తక్షణం బ్యారేజీకి మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో బ్యారేజీ ఫెయిల్ అవుతుందని కేంద్రమంత్రి లోక్‌సభలోనే సమాధానం ఇవ్వడం ఒకటైతే.. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు తక్షణం చేపట్టాలని కూడా సూచించింది. సమయం చూస్తే.. చాలా తక్కువగా ఉంది. కాంట్రాక్టుకు నోటీసులిచ్చాం.. అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని భీష్మించుకుని కూర్చుంటే.. వేల కోట్ల ప్రజాధనం గోదారి పాలు కాకతప్పని పరిస్థితి కనపడుతోంది.

తమకేం సంబంధం లేనట్టుగా కాంట్రాక్టు సంస్థ వ్యవహారం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేస్తే.. తెలంగాణ పచ్చబడటంలో కచ్చితంగా మేడిగడ్డ పాత్ర ఉంటుందనే నమ్మకం నిపుణుల నుంచి వినపడుతోంది. ఇక శషభిషలు మాని.. మరమ్మతు పనులకు నడుం బిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది..!  

ప్రభుత్వం చూపు కాంట్రాక్టరు వైపు..

గడిచిన రెండేళ్లుగా మేడిగడ్డ బ్యారేజీకి చేయాల్సిన మరమ్మతులపై సర్కారు తాత్సారం చేస్తోంది. పైగా అటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మరోవంక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణల వల్ల జాప్యం అయ్యింది. అయితే ఈ రెండు విచారణల్లోనూ సదరు కాంట్రాక్టు సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ సొంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టాలని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం కాంట్రాక్టరుకు నోటీసులు పంపించింది.

వెంటనే మరమ్మతులు చేయాలని సూచించింది. అయితే కాంట్రాక్టరు మాత్రం ఆ దిశగా ఆలోచిస్తున్న సంకేతాలు కనపడటం లేదు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమనే సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది.

సర్కారే ముందుకు రావాలి..

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో న్యాయపోరాటం చేస్తామని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామనే శషభిషలకు వెళ్లడం కన్నా.. ప్రభుత్వమే ముందుకు రావడం అన్నింటికన్నా ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా కనపడుతోందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే రెండేండ్ల సమయం వృథాగా గడిచిపోయింది. మరో ఐదారు నెలల్లో వర్షాకాలం సీజన్ ప్రారం భం అవుతుంది. వర్షాకాలంలో మరమ్మతు పనులు అసలు చేయలేం. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగానే ఉంటుంది.

ఈనేపథ్యంలో కాంట్రాక్టరుపై భారం వేసి.. మీనమేషాలు లెక్కించే పరిస్థితి కనపడటం లేదు. తక్షణం మరమ్మతులు చేయకపోతే మేడిగడ్డ బ్యారేజీ ‘అస్థిత్వమే’ దెబ్బతినేలా.. బ్యారేజ్ ఫేయిల్ అయ్యే ప్రమాదం ఉందని ఎన్‌డీఎస్‌ఏ సూచనలను సాక్షాత్తు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషన్ చౌదరి లోక్‌సభలోనే చెప్పారు. ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా వివరించారు.