calender_icon.png 31 January, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లులారా దీవించండి!

31-01-2026 01:53:43 AM

మేడారంలో భక్తకోటి మొక్కులు

* మేడారం జాతరకు మూడవరోజు భక్తులు పోటెత్తారు.. వన దేవతల నామస్మరణతో అడవి ప్రతిధ్వనించింది. ‘తల్లులారా దీవించండి.. వెళ్లొస్తాం.. మళ్లీ వస్తాం’ అంటూ గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను భక్తులు వేడుకున్నారు. అమ్మల ఆశీస్సుల కోసం గద్దెల ప్రాంగణానికి భక్తులు చీమలదండులా తరలివచ్చారు. సమ్మక్క, సారల మ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువైన గద్దెల ప్రాంగ ణం భక్తకోటితో కిక్కిరిసిపోయింది. మేడారానికి దారితీసే రహదారుల్లో వాహనాలు క్యూ కట్టాయి.

శుక్ర వారం మేడారం సమ్మక్క సారలమ్మలను పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ గ్యారత్ ఓవెన్ కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. మేడారం మహా జాతర శనివారం చివరి అంకానికి చేరనుంది.

జాతరలో భాగంగా శనివారం వనదేవతలను తిరిగి వనప్రవేశం చేయించనున్నారు. శనివారం సాయంత్రం సమ్మక్మ తల్లిని చిలకలగుట్టకు, సారలమ్మ తల్లిని కన్నెపల్లికి, పగిడిద్దరాజును పునుగొండ్లకు, గోవింద రాజును కొండాయికీ తీసుకెళ్లనున్నారు. వనదేవతల వన ప్రవేశంతో 2026 మేడారం మహా జాతర ముగిసినట్టు ప్రకటిస్తారు.

  1. మేడారం జాతరకు డూడుల్ చిత్ర రూపం!
  2. ఆర్టీసీ బస్టాండ్లలో భక్తుల నిరీక్షణ
  3. వనదేవతల ఆశీస్సులతో భక్తజనం తిరుగుముఖం

* అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ దంపతులు, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ బలరాంనాయక్, పినపాక, సికింద్రాబాద్, భూపాలపల్లి ఎమ్మెల్యేలు

* మహాజాతరలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి కొండా సురేఖ, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ తులాభారం 

  1. తన నైపుణ్యంతో ఆకట్టుకున్న వరంగల్ యువకుడు రిషికేష్ 
  2. వెళ్లొస్తాం.. మేడారం మల్లొస్తాం.. అంటూ భక్త జనసంద్రం తిరుగుముఖం 
  3. నేడు దేవతల వనప్రవేశం 

మేడారం/ములుగు, జనవరి 30 (విజయక్రాంతి): మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నిధిలో భక్తిప్రవాహం వెల్లువిరిస్తోంది. శతాబ్దాల ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన అరణ్య దేవతల గద్దెల వద్ద లక్షలాది మంది భక్తులు శుక్రవారం మొక్కులు తీర్చుకున్నారు. మనసు నిండా కృతజ్ఞతాభావంతో తిరుగుముఖం పడుతున్నారు. వనదేవతల స్పర్శతో పునీతమై, మేడారం జాతర పరిసరాలన్నీ అమ్మవార్ల నామస్మరణతో ప్రతిధ్వనిం చాయి.

కోరిన కోరికలు నెరవేర్చినందుకు సమ్మక్క సారలమ్మ వనదేవతలకు కృతజ్ఞతగా లక్షల మంది భక్తులు పసుపు కుంకుమ (బండారి), వడిబియ్యం, బంగారం(బెల్లం), పూలు, చీరే, కొబ్బరికాయలు, వెండి తొట్టెలు, కానుకలు, నైవేద్యాలు అర్పించారు. తరతరాల విశ్వాసాన్ని మోసుకొచ్చిన ఈ మొక్కుబడి ఆచారం, వనజన జీవన విధానానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది.

వన దేవతలపై భక్తుల హృదయాలు నమ్మకంతో నిండిపోయాయి. ‘అమ్మల ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి’ అనే అపార విశ్వాసంతో, తమ తమ గ్రామాలు, గమ్యాల వైపు అడుగులు వేశారు. వనదేవతల జాతర సందర్భంగా దర్శనమిచ్చిన ఈ భక్తి సమాగమం, ఆదివాసీ సంస్కృతీ వైభవాన్ని మరింత ఘనంగా చాటింది.

వనదేవతల ఆశీస్సులతో..

అరణ్య దేవతల నామస్మరణతో మార్మోగిన వనప్రాంతాలు భక్తిశ్రద్ధలతో వెల్లివిరి శాయి. సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, పూజలు ముగిసిన అనంతరం తిరుగు ముఖం పట్టారు. మేడారం జాతరలో వనదేవతల దర్శనం భక్తుల హృదయాల్లో అపారమైన ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. కుటుంబ సంక్షేమం, పంటల సమృద్ధి, ఆరోగ్య ఐశ్వర్యాల కోసం వేడుకున్న భక్తులు, అమ్మవారి కృపపై అచంచల విశ్వాసంతో ‘వెళ్లొస్తాం తల్లీ .. మేడారం జాతరకు మళ్లివస్తాం’ అంటూ తమ ఇళ్లకు తిరుగు ప్రయాణాన్ని కొనసాగించారు. వనజన సంప్రదాయాలకు అద్దం పట్టిన ఈ ఘట్టం, మేడారం జాతర ఆధ్యాత్మిక మహిమకు మరోసారి ప్రతీకగా నిలిచింది.

నేడు ముగియనున్న మహాజాతర

మేడారం మహా జాతర శనివారం చివరి అంకానికి చేరనుంది. లక్షలాది మంది భక్తులకు ఇలవేల్పుగా విలసిల్లుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా శనివారం వనదేవతలను తిరిగి వనప్రవేశం చేయించను న్నారు. శనివారం సాయంత్రం సమ్మక్మ తల్లిని చిలకలగుట్టకు, సారలమ్మ తల్లిని కన్నెపల్లికి, పగిడిద్దరాజును పునుగొండ్లకు, గోవిందరాజును కొండాయికీ తీసుకెళ్లనున్నారు. వన దేవతల వన ప్రవేశంతో 2026 మేడారం మహా జాతర ముగిసినట్టు ప్రకటిస్తారు.

జాతరకు డూడుల్ చిత్ర రూపం!

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను కళ్లకు కట్టినట్లు డూడుల్ ఆర్ట్ ద్వారా చిత్రరూపాన్ని ఇచ్చాడు వరంగల్ యువకుడు సరుగు రిషికేష్. బీటెక్ చేసిన రిషికేష్ డూడుల్ ఆర్ట్‌లో నైపుణ్యాన్ని సంపాదించారు. మేడా రంలో దృశ్యాలను తన మదిలో నింపుకొని డూడల్ ఆర్ట్ ద్వారా పెన్సిల్‌తో సమ్మక్క సారలమ్మ జాతరకు చిత్రరూపం ఇచ్చాడు.  వనదే వతల వైశిష్యాన్ని, ప్రస్తుత రాతిశిలల ప్రాకారం వరకు డూడల్ చిత్రాలు ఆకట్టుకున్నాయి.

వన దేవతలకు నిండుగా మొక్కులు

 మేడారం మహాజాతర శుక్రవారం భక్తకోటి నినాదాలతో మార్మోగింది. అడవి అంతా అరణ్య  దేవతల నామస్మరణతో ప్రతిధ్వనించింది. సమ్మక్క సారలమ్మ సన్నిధి భక్తిశ్రద్ధలు వెల్లివిరిశాయి. భక్తకోటి దండాలు పెడుతూ.. గద్దెల ప్రాంగణానికి చీమలదండులా బయలుదేరి ఇలవేల్పు దేవతలకు మొక్కులు సమర్పించింది. వనదేవతల స్పర్శతో అశేష జనవాహని పునీతమై, తల్లులారా దీవించండి.. వెళ్లొస్తాం.. మళ్లీవస్తాం అంటూ వేడుకుంది.

అమ్మవార్లను గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ దంపతులు, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ బలరాంనాయక్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, పినపాక, సికింద్రాబాద్, భూపాలపల్లి ఎమ్మెల్యేలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తులాభారం తూగి నిలువెత్తు బంగారాన్ని సమర్పిం చుకున్నారు. మేడారం జాతర వైభవానికి డూడుల్ చిత్ర రూపం జీవం పోసింది. ఇంకా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తకులు తండోపతండాలుగా మేడారానికి తరలొస్తున్నారు. నేడు దేవతల వనప్రవేశం జరుగనుంది.

వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్త‘కోటి’

ఇలవేల్పు దేవతలకు మొక్కులు సమర్పించడానికి భక్తకోటి శుక్రవారం గద్దెల ప్రాంగణానికి చీమలదండులా బయలుదేరారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెను అధిష్టించిన మరుక్షణం నుంచే మొక్కులను భక్తులు సమర్పించుకునేందుకు గద్దెలకు క్యూ కట్టారు. నిర్విరామంగా భక్తుల దర్శన కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం పూర్తిగా వనదేవతలంతా భక్తుల మొక్కులు తీర్చుకోవడానికి గద్దెలపైన ఆశీనులు అయ్యారు. జాతరలో మొక్కులు సమర్పించుకోవడానికి భక్తులు అమిత ఆసక్తి చూపించారు. దీనితో శుక్రవారం మేడారం గద్దెల ప్రాంగణం పూర్తిగా భక్తకోటితో నిండిపోయింది. మేడారం గద్దెల ప్రాంగణం జాతర ప్రధాన రహదారులు పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయాయి.

అమ్మవార్లకు మొక్కులు సమర్పించిన మంత్రి సీతక్క

శుక్రవారం మేడారం గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను పంచాయతీ రాజ్, మహిళాశిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి దనసరి అనసూయ(సీతక్క) దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు మొక్కులు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం జాతరకు వచ్చిన భక్తులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారం జాతర రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

సమ్మక్క సారలమ్మలను దర్మించుకున్న ప్రముఖులు

మేడారం సమ్మక్క సారలమ్మలను పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మేడారం జాతరకు వచ్చి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.

పొలిటికల్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రఘురాం, రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా అమ్మవార్లకు మొక్కలు చెల్లించారు. హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ గ్యారత్ ఓవెన్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తులాభారం కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. సంప్రదాయ హ్యాండ్లూమ్ వస్త్రధారణలో రావడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్‌కు గద్దల వద్ద జరిగిన నూతన కట్టడాలు, అభివృద్ధి, విశేషాలు గురించి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టీఎస్.దివాకర్ ఆయనకు వివరించారు. జాతర విశేషాలను ఆయన ఎంతో ఆసక్తిగా తిలకించారు.

ఆర్టీసీ బస్టాండ్లలో భక్తుల నిరీక్షణ

మేడారం, జనవరి 30(విజయక్రాంతి): మేడారం జాతర సందర్భంగా వరంగల్‌కు వెళ్లేందుకు వచ్చిన భక్తులు ఆర్టీసీ బస్టాండ్లలో అధిక రద్దీతో శుక్రవారం అవస్థలు పడ్డారు. కొంతసేపు క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అదనపు బస్సులు ఏర్పాటు చేసి సేవలను మరింత మెరుగురుస్తున్నామని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

మేడారంలో ఉచిత మరుగుదొడ్లకు డబ్బులు

  1. అనధికారికంగా రూ.10 నుంచి 20 వసూళ్లు 
  2. దుర్గంధంతో ఇబ్బందులు

ములుగు/మేడారం, జనవరి 30 (విజయక్రాంతి): మేడారం మహాజాతరలో భక్తులు ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరలో ప్రభు త్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. మరుగుదొడ్ల నిర్వహణ భక్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

ప్రభుత్వం ఉచితంగా వినియోగించుకోవాలని ఏర్పాటుచేసిన తాత్కాలిక మరు గుదొడ్ల వద్ద కొందరు అనధికార వ్యక్తులు బహిరంగంగా వసూళ్లకు పాల్పడుతున్నారని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి వినియోగించాలంటే రూ.10 నుంచి రూ.20 వరకు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇవ్వకపోతే లోపలికి అనుమతించకపోవడం, మాట ల దురుసుతనం ప్రదర్శించడం జరుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.