calender_icon.png 31 January, 2026 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు జలద్రోహం

31-01-2026 01:43:02 AM

జలవివాదాల సమావేశంలో తెలంగాణకు మరణ శాసనం

  1. రాష్ట్ర నీటి హక్కులు ఏపీకి ధారాదత్తం
  2. నల్లమల్లసాగర్‌కు రేవంత్‌రెడ్డి సహకారం
  3.   200 టీఎంసీల గోదావరి జలాలు తరలించేందుకు కుట్ర
  4. చంద్రబాబుతో దోస్తీ కట్టి తీరని అన్యాయం
  5. ద్రోహంలో కత్తి చంద్రాబాబుది...పొడిచేది రేవంత్ రెడ్డి
  6. నీటి హక్కుల కోసం బీఆర్‌ఎస్ మరో పోరాటం 

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): ఢిల్లీలో జరుగుతున్నది పేరుకే జలవివాదాల కమిటీ సమావేశమని.. అంతర్గతంగా తెలంగాణకు జలద్రోహం జరుగు తోందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళనవ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కండీషన్లు పెట్టి.. వాటికి కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకుండానే సమావేశానికి హాజరయ్యిందంటే అది పోలవరం సమస్య పరిష్కారం కోసమే అని ఆయన ఆరోపించారు.

200 టీఎంసీల గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుపోయే కుట్ర జరుగుతోందని, పథకం ప్రకారమే పోలవరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం నల్లమలసాగర్‌కు డీపీఆర్ ఆపాలని, ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వొదని రెండు షరతులు విధించి, వీటికి కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వకుండానే సమావేశానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో దో స్తీ కట్టి తెలంగాణకు సీఎం రేవంత్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.   

నీటి చరిత్రలో ఇది బ్లాక్ డే...

రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని, కాళోజీ ముందే ఊహించి చెప్పినట్లు.. ప్రాంతం వా డే తెలంగాణకు చేస్తున్న ద్రోహం ఇదన్నారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జల ద్రోహం జరుగుతోందన్నారు. ఒక వేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందన్నారు. గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్‌ఎస్ మొదటి నుంచి అప్రమత్తం చేస్తూనే వస్తుందన్నారు. గతంలో అనేక సార్లు ప్రెస్‌మీట్ పెట్టి వాస్తవాలు బయట పెట్టినట్లు హరీశ్ రావు తెలిపారు.

నామమాత్రంగా బ్యాక్ డేట్ వేసి లెటర్లు మీడియాకు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ముల్లు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నామని, అది బనకచర్ల అయినా, నల్లమల సాగర్ అయినా మారింది పేరు మాత్రమే కానీ, ఏపీ జల దోపిడీ ఆగలేదని మండిపడ్డారు. జల ద్రోహం విషయంలో కత్తి చంద్ర బాబుది అయితే, పొడిచేది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదన్నారు.

ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్ ప్రభుత్వం మరణ శాసనం రాయబోతున్నదని, పోలవరం నల్లమల సాగర్ విష యంలో రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకా రం ఏపీకి సహకరిస్తున్నదని ఆరోపించారు. మీటింగ్‌కు పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు ఢిల్లీ మీటింగ్‌కు వెళ్లాడని, ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపా రన్నారు.

పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాసాడని, వేయను అంటూనే కమిటీ వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశారని విమర్శించారు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టుకు వెళ్లి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపారని, పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్‌కు మద్దతు ప్రకటించారని, దానిని వాపస్ తెచ్చుకున్నది ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని తెలిపారు.

కేంద్రం హామీ ఇచ్చిందా? 

నల్లమల సాగర్‌కు డీపీఆర్‌ను, కేంద్రం అనుమతుల ప్రక్రియను తక్షణం ఆపాలి అని, ప్రీ ఫీజిబులిటి రిపోర్టు ఆపినట్లు ఏపీ హామీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఈ రెండు షరతులపై కేంద్రం ఏమైనా హామీ ఇచ్చిందా? లేకుంటే ఏపీ ఇచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు.  మీ  అప్రూవల్ తోనే లెటర్ పోయింది కదా ఎందుకు హామీ లేకుండా సమావేశంలో పాల్గొంటున్నారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన నిలదీశారు. ఎందుకు ఈరోజు మీటింగ్‌కు ఎగేసుకొని పోయారని, తెలంగాణకు అన్యా యం జరుగుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోడు, మీరైనా ఎందుకు పట్టించుకోరు అని ప్రశ్నించారు.

కేసీఆర్ పాలనలో అద్భుత ప్రగతి 

కేసీఆర్ పాలన గురించి ఎకనామిక్ సర్వే రిపోర్టే స్పష్టం చేసిందని, తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని ఆయన వెల్ల డించారు. రెండు కోట్ల 20లక్షల ఎకరాల మాగాణిగా మారిందని, కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా అద్భుతమైన ఆయకట్టు వచ్చిందని, కాళేశ్వరం ద్వారా 17 లక్షల 823 ఎకరాల స్థిరీకరణ, మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైందన్నారు. మొత్తం 32 లక్షల ఎకరాల ఆయకట్టు బీఆర్‌ఎస్ సాధించిందన్నారు. 

రేవంత్ తెలంగాణ సమాజం క్షమించదు 

 చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణ సమాజం క్షమించదని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఈరోజు (శుక్రవారం) ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామ న్నారు. నువ్వు పెట్టిన కండీషన్లకు వచ్చిన సమాధానం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి.. నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, తెలంగాణ నీటి హక్కుల కోసం మరో పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ 

ప్లాన్డ్‌గా సహకరిస్తూ చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురు దక్షిణ చెల్లిస్తున్నారని, ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్‌లో నేడు ఇంజి నీర్లు పాల్గొంటున్నారని, పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ, మన 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టు సంబంధించిన కుట్ర ఇదన్నారు. గతంలో కేంద్ర జలశక్తిశాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముం దుపెట్టిందని, ఇప్పుడు కూడా ఏపీ నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ నిలదీస్తే.. డిసెం బ ర్ 30వ తేదీన తాను ఉత్తరం రాస్తేగానీ ప్రభుత్వానికి సోయి లేదన్నారు.

కేంద్రమంత్రులు నోరు పారేసుకోవద్దు 

కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా తమపై నోరు పారేసుకోవడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. కేంద్రంలోని మీ ప్రభుత్వమే తెలంగాణ ప్రగతి పథాన్ని వివరిచిందని, కళ్లు తెరవండి అనవసరంగా బీఆర్‌ఎస్ మీద నోళ్లు పారేసుకోకండన్నారు. తామేమో తెలంగాణకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే, రేవంతు ఏపీకి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నీటిని ఒడిసి పట్టింది కేసీఆర్ విడిచి పెట్టింది రేవంత్...సోయి లేని రేవంత్ నల్లమల సాగర్‌కు జెండా ఊపుతున్నారని విమర్శించారు.