31-01-2026 01:30:16 AM
ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే రాష్ట్రమంతా అమలు
షాద్‌నగర్, జనవరి 30, (విజయక్రాంతి): ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే రాష్ట్రమంతటా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు క్యాబినెట్ ఆలోచన చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో అల్పాహార పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే ప్రారంభించామని వివరించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, మా సంకల్పం గొప్పదని, ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే, అన్ని వనరులు సమకూరితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం ప్రవేశపెడతామని తెలిపారు. కామన్ స్కూల్ విధానం ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుందని, చిన్ననాటి నుంచే అందరం కలిసిపోయాం అనే భావన కులం, మతం, ధనిక, పేద తేడా లేదన్న నిర్మాణాత్మక ఆలోచన సమాజంలో పెరగాలని ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నదని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారి ఒక్కో పాఠశాలను 25 ఎకరాలు విస్తీర్ణంలో 200 కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 20వేల కోట్లు వెచ్చిస్తూ ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలంటే గొప్ప మానవ వనరులు ఉండాలి, మానవ వనరులకు సానపడితేనే రా ష్ట్రం ఆర్థికంగా బలపడుతుందని, అందుకు కావలసింది ఉచితంగా అందరికీ విద్య, వైద్యం ప్రజా ప్రభుత్వం ప్రధానంగా ఈ రెండు అంశాలపైనే దృష్టి సారించి ముందుకు పోతుందని వివరించారు.
ఈ ఆలోచనలో భాగంగానే పాఠశాల నిర్వాహకులు పిలవగానే గత సంవత్సరం జనవరి మాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మొగిలిగిద్ద పాఠశాలకు వచ్చి పది కోట్లు కేటాయించారని వివ రించారు. ఆ నిధులతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత పాలకులు ఐఐటీలను అనాథలుగా వదిలేస్తే మారిన కాలానికి అనుగుణంగా వాటిలో శిక్షణ ఇవ్వాలని, ఆధునిక యం త్ర పరికరాలను, మార్కెట్లో ఉన్న పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చి ఉపాధి పొందేందుకు అవ సరమైన సిలబస్‌ను రూపొందించామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వంలో డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు..
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 రో జుల వ్యవధిలోనే అధికారులతో నివేదిక తెప్పించుకొని డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఆధునిక ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుందని, జిల్లా కేంద్రా ల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరించామని వివరించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నాణ్యమైన చీరలు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి పంపిణీ గౌరవిస్తున్నామని తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దెందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని తెలిపారు..
దేశంలో భూ సంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకృష్ణారావు అని వివరించారు. దివంగత ముఖ్య మంత్రులు బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డితో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, ప్రముఖ ప్రొఫెసర్ హరగోపాల్ వంటి అనేకమంది ప్రముఖులను మొగి లిగిద్ద ప్రభుత్వ పాఠశాల దేశానికి సమాజానికి అందించిందని తెలిపారు. రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాలు నడిపించి నిజాం వ్యతిరేక పోరాటం చేసిన గొప్ప నాయకుడు బూర్గుల రామకృష్ణారావు అని కొనియాడారు.
దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మాధ్యమంలోనే విద్యాబోధన జరగాలని ౨౦౦౮లోనే చెప్పారని అన్నారు. అప్పుడు శాసనమండలిలో చర్చ సందర్భంగా ఇంగ్లిష్ మాధ్య మంలో బోధనపై తనను మాట్లాడాల్సిందిగా రాజశేఖర్‌రెడ్డి కోరారని గుర్తుచేశారు.
గత ప్రభుత్వం ద్రోహం చేసింది: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
పదేళ్ల కేంద్ర, రాష్ట్రాల పాలనలో పూర్తిగా నిర్వీర్యమైన విద్యారంగాన్ని అన్ని విధాలా బాగు చేసే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఇన్నేళ్ల చరిత్రలో ఈ పాఠశాల ఎంతోమందిని విద్యార్థులుగా తీర్చిదిద్దిందని అన్నారు. గత ప్రభుత్వం ఈ పాఠశాలను దత్తత తీసుకున్నామని ప్రకటించి ఒక్క పని కూడా చేయకుండా గాలికి వదిలేసిందని విమర్శించారు.
మొగిలిగిద పాఠశాల అభి వృద్ధికి సీఎం నిధులు మంజూరు చేయడం, అడ్వాన్స్ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ కృష్ణయ్య అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బండారి సంతోష, డీఈఓ సుసింధర్ రావు పాల్గొన్నారు.
కొడంగల్‌లో 28 వేల విద్యార్థులకు..
సీఎస్‌ఆర్ నిధులు, ఎన్‌జీవోల సహకారంతో కొడంగల్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ను అందించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాన్ని, కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
హరేకృష్ణ సంస్థ అధ్యక్షులు సత్యా గౌరచంద్రదాస ప్రభుజీ ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. వికారాబాద్ జిల్లాలో కొడంగల్, బొమ్మరాస్‌పేట్, దుద్ద్యాల్, దౌలతాబాద్ మండలాల్లోని 312 ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 28,౦౦౦ మంది విద్యార్థులకు ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌ను అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.