11-10-2025 12:00:00 AM
సాయిసుదర్శన్ హాఫ్ సెంచరీ
భారత్ స్కోర్ 318/2
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: వేదిక మారినా ఆధిపత్యం మారలేదు... వెస్టిండీస్ పేలవ బౌలింగ్ కొనసాగిన వేళ రెండోటెస్ట్ తొలిరోజు భారత్ పైచేయి సాధించింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ శతక్కొట్టడమే కాదు డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అటు సాయిసుదర్శన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీస్కోరు దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శుభమన్ గిల్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
దాదాపు ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత తొలిసారి టాస్ గెలిచాడు. ఊహించినట్టుగానే తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. బుమ్రాకు రెస్ట్ ఇస్తారని భావించినా విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించేందుకే నిర్ణయించారు. తొలి సెషన్ లో భారత ఓపెనర్లు జైశ్వాల్, కేఎల్ రాహుల్ నిదానంగా ఆడారు. రాహుల్ 38 రన్స్ కు ఔటవగా.. జైస్వాల్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ కొన సాగించారు.
లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 94/1గా ఉంది. లంచ్ తర్వాత కూడా భారత బ్యాటర్లు నిలకడగానే బ్యాటింగ్ చేశారు. టెస్ట్ ఫార్మాట్‌కు తగ్గట్టే ఆడుతూ అప్పుడప్పుడూ బౌండరీలు బాదుతూ స్కోర్ పెంచా రు. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్‌లో జైస్వాల్ తన ఫామ్ కంటిన్యూ చేశాడు. మరోవైపు వరుస అవకాశాలిస్తున్నా విఫలమవుతున్న సాయిసుదర్శన్ మాత్రం ఈ మ్యాచ్‌లో పట్టుదల ప్రదర్శిం చాడు.
వికెట్ ఇవ్వకూడదనే లక్ష్యంతో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 193 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పాడు. ఈ క్రమంలో టెస్ట్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. సాయిసుదర్శన్ ఇచ్చిన క్యాచ్‌ను విండీస్ ఫీల్డర్లు వదిలేశారు. దీనిని సద్వినియోగం చేసుకున్న అతను హాఫ్ సెంచరీ చేశాడు.అటు జైస్వాల్ కూడా 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టెస్టుల్లో అతనికిది ఏడో శతకం. ఈ క్రమంలో పలు రికార్డులను అందుకున్నాడు. 24 ఏళ్ళ వయసులోనే అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.సాయిసుదర్శన్ సెంచరీకి చేరువలో (87)కు ఔటయ్యాక.. గిల్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. సెంచరీ వరకూ నిదానంగానే ఆడిన జైస్వాల్ తర్వాత కాస్త గేర్ మార్చాడు. చూస్తుండగానే 150 పరుగుల మార్క్ దాటేశాడు.
విండీస్ బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో చివరి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు.దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్ 2 వికెట్లకు 318 పరుగులు చేసింది. జైస్వాల్ 173 , గిల్ 20 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్లలో వారికన్ 2 వికెట్లు తీయగా..
మరో నలుగురు బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రెండోరోజు భారత్ భారీస్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తొలి టెస్ట్ తరహాలోనే టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ ఆడే అవసరం రాకపోవచ్చు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 318/2 (జైస్వాల్ 173 బ్యాటింగ్, గిల్ 20 బ్యాటింగ్, సాయిసుదర్శన్ 87, రాహుల్ 38; వారికన్ 2/60)