09-05-2025 02:20:44 AM
-ఇంజినీరింగ్ విద్యార్థులకు వినూత్నంగా నైపుణ్యశిక్షణ
-రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
-టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అయాన్‌తో జేఎన్‌టీయూ ఒప్పందం
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): సాంకేతిక నైపుణ్యాలు లేకుండా డిగ్రీలతో ఉద్యోగాలు రావడం కష్టమని, అందుకే యు వతకు నైపుణ్యశిక్షణ ఇచ్చి సాఫ్ట్‌వేర్ రంగం లో ఉద్యోగావకాశాలు కల్పించే మరో వినూ త్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు ‘ప్లేస్‌మెంట్ సక్సెస్ ప్రోగ్రాం’ కింద ఐదు నెలల శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అయాన్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రి సమక్షంలో దీనికి సంబంధించి హైదరాబాద్ జేఎన్‌టీయూ అయాన్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈసందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. యంగ్ ఇండియా స్కిల్స్ యూని వర్సిటీ నెలకొల్పి యువతను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభిం చామని తెలిపారు. టీసీఎస్ అయాన్ సంస్థ మొదటి దశలో ప్రతీ ఐదునెలలకు వంద మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తుందని వెల్లడించారు. ఆ సంస్థతో ఎంప్యానెల్ అయిన మూడు వేలకుపైగా కంపెనీలు వీరిలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకుని ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పారు.
పైలట్ కార్యక్రమం కింద మొదట మంథనిలోని జేఎన్‌టీయూ కళాశాల విద్యార్థులకు ప్లేస్‌మెంట్ సక్సెస్ ప్రోగ్రాం కింద నైపుణ్య శిక్షణకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువతను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ సంసిద్ధత కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమం లో టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి, స్కిల్ ఎడ్యుకేషన్ బిజినెస్ హెడ్ స్మృతి ముల్యే, జేఎస్‌టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొ.టీ కిషన్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ పాల్గొన్నారు.