23-05-2025 08:00:36 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం సిటీ స్టైల్ జమ్ కోచ్ జివి రామిరెడ్డి, భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ పవర్ లిఫ్టింగ్ విజేతలను భద్రాచలం ప్రధమ శ్రేణి న్యాయమూర్తి శివ నాయక్ శుక్రవారం అభినందించారు. భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డివి శంకర్రావు 73 సంవత్సరాల వయసులో గుండెకు బైపాస్ సర్జరీ అయినప్పటికీ ఆయన కోచ్ అయిన జివి రామి రెడ్డి సహకారంతో, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో మార్చి నెలలో ఖమ్మంలో జరిగిన రెండు జిల్లాల స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలలో బంగారు పతకం సాధించారు. ఏప్రిల్ నెలలో మేడ్చల్ లో జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో మళ్లీ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మరో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మామిడి భూమిక గతంలో జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో మూడు బంగారు పతకాలు సాధించి ముంబైలో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ... తను కుడా ఒకప్పుడు కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించాను అని చెప్పి, తన తమ్ముడు కూడా జూడో లో స్టేట్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం గుర్తు చేశారు. అప్పట్లో మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందక క్రీడలను విడిచిపెట్టాము అని గతం గుర్తు చేశారు. డివి శంకర్రావు కి భద్రాద్రి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు వెన్నంటి ఉండి తనను ఈ స్థాయికి తీసుకుని వచ్చినందుకు సభ్యులను ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జీవి రామిరెడ్డి , సీనియర్ న్యాయవాది పామరాజు తిరుమల్ రావు, తదితరులు పాల్గొన్నారు.