23-05-2025 07:53:24 PM
టౌన్ సిఐ కరుణాకర్
హుజరాబాద్,(విజయక్రాంతి): కరాటే ద్వారా విద్యార్థిని, విద్యార్థులు మానసికంగా పరిపక్వత చెందుతారని హుజురాబాద్ టౌన్ సీఐ కరుణాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో శుక్రవారం గ్లోబల్ ఫోటోకాన్ కరాటే డు అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్ట్ మెరిట్ టెస్ట్ లో విజయం సాధించిన విద్యార్థులకు కరాటే మాస్టర్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ విద్యార్థులను సన్మానించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షులు ఎస్కే జలీల్ కరాటేను తన వృత్తిగా ఎంచుకొని ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థులను కరాటేలో ప్రయోజకులుగా తీర్చి దిద్దుతూ వారి భవిష్యత్తుకు పునాది వేస్తున్న కరాటే మాస్టర్ జలీల్ సేవలుఅభినందనీయమని అన్నారు. కరాటే విద్య విద్యార్థిని విద్యార్థులకు మానసికంగా శారీరకంగా దృఢపరుస్తుందని కరాటే పిల్లల్లో ఆత్మ సైర్యాని పెంపొందిస్తుందని అన్నారు.
సమాజంలోని ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. ఆడపిల్లలు ధైర్యంగా ముందడుగు వేస్తూ తమను తాము రక్షించుకోవడానికి కరాటే దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గణేష్, కాలిద్ హుస్సేన్, రాజిరెడ్డి, అంబాల ప్రభాకర్, రాజకుమార్, గోపాల్, జానీ, శ్రీనాథ్ తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.