calender_icon.png 23 September, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటుకు నోటు కేసులో తీర్పు రిజర్వ్

23-09-2025 12:00:00 AM

  1. సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు పూర్తి

మత్తయ్యపై ఎఫ్‌ఐఆర్‌ని కొట్టివేయడంపై సుప్రీం కోర్టులో సవాల్

తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన సీజేఐ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును సోమవారం రిజర్వ్ చేసింది. ఈ కేసుపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేసులో ముఖ్యమంత్రి ఉన్నా ఓ నిందితుడినై ఎఫ్‌ఐఆర్ కొట్టి వేయటాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రావడం అభినందనీమని వ్యాఖ్యానించింది.

రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితునిగా ఉన్న జెరూసలెం మత్తయ్యపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ కొన్ని రోజుల క్రితం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఓటుకు నోటు కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. 

ఛార్జిషీట్‌లో ఎఫ్‌ఐఆర్‌లో ఏ4గా ఉన్న నిందితుడిపై ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టుకు తెలిపారు.హైకోర్టే ట్రయల్ నిర్వహించి తీర్పు ఇచ్చేసిందని ప్రభుత్వం పేర్కొంది. కేసు ప్రాథమిక దశలోనే నిందితుడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ని కొట్టివేసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. మొత్తం కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ కొట్టివేయడం దర్యాప్తుపై ప్రభావం చూపుతోంది కాబట్టి దర్యాప్తు కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును ప్రభుత్వం కోరింది.

అయితే ఈ కేసులో హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఆదేశాలు ఇచ్చిందని మత్తయ్య తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలువిన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సీఎం ఉన్నా.. నిందితుడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభ్వుత్వం ఇక్కడకు రావడాన్ని అభినందించాలని సీజేఐ వ్యాఖ్యానించింది.దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది మేనకా గురుస్వామి ‘అది రాష్ట్రప్రభుత్వానికి ఉన్న నిబద్ధత’ అని పేర్కొన్నారు.