calender_icon.png 20 May, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు

20-05-2025 01:18:51 AM

మరో రెండు నెలలు పెంచుతూ సర్కారు ఉత్తర్వులు

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవకతవకలపై న్యాయ విచారణ కోసం ఏర్పాటుచేసిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో జూలై 31 వరకు దానిని పొడిగిస్తూ సోమవారం సర్కారు ఉత్తర్వులిచ్చింది. విచారణ దాదాపుగా ముగిసిపోయిందని.. ఈ నెలాఖరు లోపు కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందు కు ఏర్పాట్లు చేస్తోందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

దాదాపుగా అందరిని విచారించడం పూర్తయిందని ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ నివేదికలను కూడా అధ్యయనం చేయడం పూర్తయిందని ఇక నివేదిక సమర్పిస్తే కమిషన్ పని పూర్తవుతుందని కూడా భావించారు. అయితే ఈనెల 31వరకు స మయమున్నా 12 రోజులు ముందుగానే సర్కారు గడువును పెంచడం విశేషంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కాళేశ్వరం నిర్మాణంలో కర్త, కర్మ అయిన అప్ప టి సీఎం కేసీఆర్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు, ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ను తొలుత విచారణకు పిలుస్తారని అంతా భావిం చారు.

అయితే ఒక్కసారిగా కమిషన్ నివేదిక దాదాపుగా సిద్ధమైందని ప్రభుత్వానికి సమర్పించడమే తరువాయి అని ప్రచారం జరిగింది. ఇక గత ప్రభుత్వ పెద్దల విచారణ కూడా ఉండబోదని ప్రచారం జరగడం విశే షం. అయితే ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రభుత్వం కమిషన్ గడువును పెంచడంతో గత ప్రభుత్వంలోని ముఖ్య నేతలను విచారణకు పిలుస్తారేమోననే అంశం మళ్లీ చర్చల్లోకి వచ్చేసింది.