21-08-2025 01:48:35 AM
మహబూబాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి)/గజ్వేల్/నంగునూరు/హుస్నాబాద్: “సార్ నీ కాళ్లు మొక్కుతా.. బాంచన్ ఒక్క బస్తా యూరియా ఇప్పించండి” అని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఓ రైతు అధికారి కాళ్లు పట్టుకున్నాడు. బుధవారం పోలీసు బందోబస్తు నడుమ సొసైటీలో యూరియా పంపిణీ చేపట్టారు. ఉదయం 6 గంటలకే పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకున్నారు.
అయితే ఓ రైతు తన పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను అధికారికి అందజేస్తుండగా సదరు అధికారి ఆ రైతు నుంచి జిరాక్స్ ప్రతులను తీసుకోవడానికి నిరాకరించడంతో ఆ రైతు ఆ అధికారి కాళ్లు పట్టుకొని తనకు యూరియా ఇవ్వాలంటూ వేడుకున్నాడు. కాగా వానాకాలంలో సాగుచేసిన పంటలకు యూరియా ఇప్పుడు ఎంతో అవసరమని,
ఈ క్రమంలో రైతులకు యూ రియా అందుబాటులోకి లేకపోవడం వల్ల పంటలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంద ని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా గోస తీర్చాలని కోరుతున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ, జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత బుధ వారం రైతులతో కలిసి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసిఆర్ పదేండ్ల పాటు అధికారంలో ఉన్న సమ యంలో ఒక్కనాడు కూడా యూరియా కో సం రైతులు ఇబ్బందులు పడకుండా ముం దస్తు ప్రణాళికలు చేపట్టారని, కాంగ్రెస్ ప్రభు త్వం రైతు పక్షపాతి అని చెప్పుకుంటూ, రైతులను నానా అగచాట్లకు గురి చేస్తుందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రైతులు బుధవారం ధర్నా చేశారు.
పోలీసులు రైతులను చెదరగొట్టి పంపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండ లంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నంగునూరు పీఏసీఎస్ కేంద్రంలో బుధవారం యూరి యా లారీ వచ్చిందని తెలిసి తెల్లవారుజాము నుంచే రైతులు భారీ సంఖ్యలో అక్క డికి చేరుకున్నారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రైతులు యూరియా కోసం ఎదురు చూశారు.
తమ శ్రమకు, కష్టానికి దక్కని ఫలితం చూసి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 64,200 హెక్టార్ల సాగు విస్తీర్ణంలో వరి, పత్తి, మక్కజొన్న వంటి ప్రధాన పంటలను పండిస్తు న్నారు. ఈ సీజన్‌కు నియోజకవర్గానికి అవసరమైన 15,800 టన్నుల యూరియాకు గాను, కేవలం 9,450 టన్నులు మాత్రమే అందింది. దాదాపు 40 శాతం లోటుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెల్లవారకముందే క్యూ
బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం బుధవారం తెల్లవారుజాము నుంచే రైతులు బా రులు తీరారు. యూరియా ఒక లోడ్ బస్తాలకు రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సులను అందజేయగా ఆన్లున్లో నమోదు చేసుకొని ఆధార్ కార్డుకు ఒకటి రెండు బస్తాల చొప్పున టోకెన్లు పంపిణీ చేశారు. కొంతమంది రైతులకు టోకెన్ దొరక్క నిరాశతో వెనుదిగిరిగి వెళ్లి పోతున్నారు.