04-09-2025 01:10:58 AM
-అవినీతి సొమ్ము వాటాల పంపిణీలో గొడవలు
-రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క
-సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కల్వకుంట్ల కుటుంబంలో జాగృతి అధ్యక్షురాలు కవిత పేరుతో పొలిటికల్ డ్రామా నడుస్తున్నదని, అవి అవినీతి, అక్రమాల సొమ్ము పంపకాల్లో గొడవలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కకొట్టిపడేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకొనే కేసీఆర్.. తన కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
మాజీ ఎంపీ సంతోశ్ బినామీగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వందల కోట్లు సంపాదించారని స్వయంగా కవిత చెప్పారని, ములుగులో తనను ఓడించేందుకు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కోట్లు ఖర్చు పెట్టారని వెల్లడించారు. కవిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కవిత వెనకేసుకురావడం ఒక పెద్ద డ్రామా అని, మొదట కేటీఆర్‌ను టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు హరీశ్‌రావు సంతోశ్ టార్గెట్ చేశారన్నారు.
కవిత సస్పెన్షన్ ఆ పార్టీ అంతర్గత విషయమని, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంబురాల పేరుతో బీఆర్‌ఎస్ కార్యాలయానికి నిప్పు పెట్టుకోవడమేంటని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబమంతా భవిష్యత్తులో కలిసి పోతారని, చివరకు కవితను విమర్శించిన పార్టీ మహిళా నాయకురాళ్లంతా నష్టపోతారని జోస్యం చెప్పారు.