calender_icon.png 3 July, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని ఆపలేమా?

03-07-2025 02:46:45 AM

ప్రస్తుత కాలంలో విద్య అనేది ప్రైవేటు స్కూళ్లలో దోపిడీ వ్యవస్థగా మారింది. ఆ వ్యవస్థకు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు యజమానిగా, అక్కడ పాఠాలు బోధించే ఉపాధ్యాయులు సేల్స్‌మెన్‌గా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వినియోగదారులుగా మారిన పరిస్థితి మనకు గోచరిస్తున్నది. ఇలాంటి వాతావరణంలో నాణ్యమైన విద్య పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారింది. డబ్బున్న వారి నట్టింట్లోకి నడిచి వచ్చే అమ్మకపు వస్తువుగా, పేదవాడు ఏ నాటికీ కొనలేని ఖరీదైన వస్తువుగా మారింది. ముఖ్యంగా నర్సరీ నుంచి 10వ తరగతి వరకు తరగతులు నడిపే ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు తల్లిదండ్రుల ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి.

మహారాష్ట్రలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు ఫీజులను ప్రతిపాదిస్తాయి. ఢిల్లీలో స్వయంగా ప్రభుత్వమే పాఠశాలలను పరిశీలించి, ఖర్చుల వివరాల ప్రాతిపదికన ఫీజులు పెంచతుంది. లేదా తగ్గిస్తుంది. గుజరాత్‌లో అక్కడి ప్రభుత్వం ఫీజు రెగ్యులైజేషన్ కమిటీ సిఫార్సుల మేరకు ఫీజులు నిర్ణయిస్తుంది. రాజస్తాన్ లో రాష్ర్టస్థాయి నియంత్రణ కమిటీ ఫీజుల గురించి గరిష్టంగా పరిమితి ప్రకటిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో వినిమయ సూచీ ఆధారంగా ఫీజులు పెంపు, తగ్గుదల ఉంటుంది. తెలంగాణలో ప్రభుత్వ అధికారుల కమిటీ ఫీజులపై పర్యవేక్షణ చేస్తుంది. ఎక్కడ ఎవరి పర్యవేక్షణ ఉన్నా, పైచేయి మాత్రం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలదే కావడం గమనార్హం.

దశాబ్దాల నుంచి శాసిస్తున్న వైనం..

ప్రైవేటు, కార్పొరేట్ శక్తులు విద్యారంగాన్ని దశాబ్దాల నుంచి శాసిస్తూ వస్తున్నా యి. ముఫ్ఫు ఏళ్ల క్రితం రూ.వందల్లో ఉన్న ఫీజులు ఇప్పుడు లక్షలకు చేరుకున్నాయంటే అర్థమేంటి? చదువు అనే అంశంపై ఎంత వ్యాపారం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అధికారిక లెక్కల ప్రకా రం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.20 లక్షలకు పైగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఆయా యాజమాన్యాలు విద్యా ర్థుల నుంచి అడ్మిషన్, ట్యూషన్, పరీక్షలు, హాస్టల్, లైబ్రరీ, లేట్, ప్రాక్టికల్,  ఐఐటీ,  స్కూల్ వ్యాన్, సీబీఎస్‌ఈ, మెడికల్ ఫౌండేషన్ క్లాస్ , డిజిటల్ క్లాస్ అంటూ రకరకాల ఫీజులు వసూలు చేస్తున్నాయి.

అక్కడ చదివించకపోతే తమ పిల్లలు ఆగమైపోతారనే భ్రమలో తల్లిదండ్రులు కూడా ప్రైవేటు విద్యాసంస్థలు అల్లిన మాయాజాలంలో చిక్కుకుంటున్నారు. పేద, మధ్య తరగతివర్గాలు కూడా అప్పు చేసి మరీ పిల్లలను చది విస్తున్నాయి. ఇంట్లో భార్యాభర్తలు పనిచేస్తే, వారిలో ఒకరి వేతనం పూర్తిగా విద్యార్థుల ఫీజులకే చెల్లించే పరిస్థితి. మరికొన్ని కార్పొరేట్ యాజమాన్యాలైతే కేవలం కోటీశ్వరుల ఇంట పుట్టిన పిల్లలకే అడ్మిషన్లు ఇస్తున్నాయంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

ఆ విద్యాసంస్థల్లో ఎక్కడ కూ డా రిజర్వేషన్ల అమలు ఉండదు. అంటే.. అక్కడ బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు చోటులేదనే అర్థం కదా. అదే నిజమైతే.. మరి యాజమాన్యాలు విద్యాహ క్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నట్లే కదా. ఎడ్యుకేషన్ మాఫియా ఆగడాలు ఇలా పె చ్చరిల్లుతుంటే ప్రభుత్వాలు ఎందుకు మీనామేషాలు లెక్కిస్తున్నట్టు. రాజకీయనేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతోనే యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయనేది వాస్తవం.

ఇంకా కచ్చితంగా చెప్పాలంటే రాజకీయ నాయకుల ఎన్నికల అవసరాలకు ఈ యా జమాన్యాలు కూడా అంతో ఇంతో సొమ్ము సర్దుతాయనే ప్రచారం కూడా బయట నడుస్తున్నది. ఒకప్పుడు ఆ పాత్రను బడా పారి శ్రామిక వేత్తలు పోషించేవారు. ఇప్పుడు విద్యాసంస్థల యాజమాన్యాలు భాగస్వాములవుతున్నాయి. అందుకే ఏ పార్టీ అధి కారంలో ఉన్నా.. ఎవరూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల జోలికి మాత్రం వెళ్లడం లేదు. 

జీవోతో సరి.. పర్యవేక్షణ శూన్యం..               

ఫీజుల నియంత్రణ విషయంలో యాజమాన్యాలు ప్రభుత్వాల ఆదేశాలు, న్యాయా స్థానాల తీర్పులను ఖాతరు చేయడం లేదనేది.. యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజులను చూసే చెప్పవచ్చు. ప్రభుత్వాలు తల్లిదండ్రులు, ప్రజాసంఘాల ఒత్తిడితో ప్ర భుత్వాలు ఒకసారి కొత్త జీవోను అమలు చేస్తాయి. కానీ, ఆ తర్వాత వాటిపై పర్యవేక్షణే ఉండదు. కొన్ని యాజమాన్యాలైతే అసలు భౌతికంగా తరగతులు కూడా తీసుకోవడం లేదు. కేవలం ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించి కూడా ఫీజులు వసూలు చేస్తున్నా యి. తల్లిదండ్రులు మాత్రం ఎప్పటిలాగే కార్పొరేట్ విద్యా సంస్థల మోసపూరిత ప్రకటనలతో తమ తాహతుకు మించి ఫీజులు చెల్లిస్తున్నారు. తద్వారా అప్పుల పాలవుతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న అనేక కుటుంబాలు ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోయా యి. పేద, మధ్య తరగతి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అధికంగానే ఫీజులు వసూలు చేశాయి. ఆన్‌లైన్ తరగతుల పేరిట వేలల్లో ఫీజు లు వసూలు చేశాయి.

ఫీజుల కోసం కొత్త కొత్త పేర్లు..

ఐఐటీ ఫౌండేషన్ అంటూ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వే స్తున్నాయి. ఒకప్పుడు నగరాలు, పట్టణాల్లో ఉన్న ఆ సంస్కృతి ఇప్పుడు మండల కేంద్రా లు, గ్రామస్థాయికి వచ్చింది. తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఫీజుల భారం మోపుతున్నాయి. ఆ సంస్థలు అగ్గిపెట్టె లాంటి గదు ల్లో విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నా, సరైన శిక్షణ, అర్హత లేని ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్నా, మౌలిక సదుపాయాలు లేకపోయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

కొందరు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాజమాన్యాలు తల్లిదండ్రులను ఆకర్షించేందుకు తమ స్కూల్ పేరు పక్కన ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఇంటర్నేషనల్, ఈ టెక్నో వంటి ఎన్నో పదాలను చేరుస్తున్నాయి. ఆ సౌండింగ్ విన్న తల్లిదండ్రులు అక్కడేదో అద్భుతం జరుగుతుంది.. తమ పిల్లల భవిష్యత్తుకు ఇక బంగారు బాటలు పడతాయని నమ్మి భారమైనా ఫీజులు కడుతున్నారు. అలా వేలాల్లో నుంచి ఫీజులు లక్షలకు చేరుకున్నాయి.

హైదరాబాద్ వంటి నగరాల్లో నర్సరీ, ఎల్‌కేజీ ఫీజులే లక్షకు పైగా ఉంటున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యాజమాన్యాలు తన వ్యా పార సామ్రాజ్యాన్ని పెంపొందించుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు తమ రక్తమాంసాలు పెట్టాల్సి వస్తున్నది. ఇదంతా ఒకవైపు అయితే.. ఆయా విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి మరీ దారుణం. ఒకవిధంగా చెప్పాలంటే యాజమాన్యాలు వారితో వెట్టి చాకిరీ చేయి స్తున్నట్లే లెక్క.

ఒకసారి ఒక ఉపాధ్యాయుడు ఒక సంస్థలో చేరితే ఇక అతడు ఆ సంస్థకు బానిసయ్యే పరిస్థితి నెలకొన్నది. సాధారణంగానైతే విద్యార్థులకు నాణ్యమైన విద్య అం దించడం, అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం, వారికి క్రమశిక్షణ నేర్పడం ప్రాథమిక విధు లు ఉంటాయి. కానీ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తే ఉపాధ్యాయులు.. పాఠాలు బోధించే ఒక్కపనే కాదు.. గుమాస్తాగా, అకౌంటెంట్‌గా, విద్యార్థులను స్కూళ్లలో చేర్పించే ఏజెంట్‌గానూ పనిచేయాలి. అంతా చేస్తే.. వారికేమన్నా పెద్ద జీతాలు ఉంటాయనుకుంటే పొరపాటే. వారికి అందే జీతాలు కూడా అంతంతమాత్రమే. 

తిరుపతిరావు కమిటీ సిఫార్సులు ఏమయ్యాయి?

ఫీజుల నియంత్రణపై అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం తిరుపతిరావు కమిటీని నియమించింది. కమిటీ ఎంతోమంది పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడింది. వారి అభిప్రాయాలను సేకరించింది. తర్వాత యాజమాన్యాలు ఏటా పదిశాతం ఫీజులు పెంచుకోవచ్చని, పదిశాతం దాటితే.. యాజమాన్యం ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంకు లావాదేవీల ద్వారానే జరగాలని సూచించింది. వాటిన్నింటి లెక్కలను పక్కాగా చూపాలి. ఫీజుల రెగ్యులేటరీ కమిటీ కచ్చితంగా ఆ లావాదేవీలను పర్యవేక్షించాలి. ప్రభుత్వం ఈ సిఫార్సుల న్నింటినీ అమలు చేయాల్సి ఉంది. కానీ, సర్కార్ ఎప్పుడు అమలు చేస్తుందో తెలియని పరిస్థితి.

వ్యాసకర్త సెల్ 99630 40960