13-10-2025 12:00:00 AM
కరీంనగర్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): కరీంనగర్ సైక్లిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన హాఫ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. 3, 5, 10, 21 కిలోమీటర్ల పరుగులో పెద్ద ఎత్తున విద్యార్థులు మొదలుకొని వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి సైతం ఔత్సాహికులు ఈ మారథాన్ కు హాజరయ్యారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 10, 21 కిలోమీటర్ల పరుగును ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఓ.ఎస్.డి వేముల శ్రీనివాసులు 3, 5 కిలోమీటర్ల మారథాన్ రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం రన్నింగ్ చేస్తే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతామని.. ప్రతి ఒక్కరూ కనీసం నిత్యం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని పేర్కొన్నారు.
నగరవాసులకు ఫిట్ నెస్ పై అవగాహన కల్పించేందుకు మారథాన్ కార్యక్రమాన్ని 3కె, 5కె, 10కె, 21కె విడతలుగా నిర్వహించినట్లు కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఐవీ స్కూల్ విద్యాసంస్థల అధినేత పసుల మహేష్ పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలుగా కరీంనగర్ లో నిర్వహిస్తున్న మారథాన్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మారథాన్ పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు వుడుతల పద్మావతి, డి.వై.ఎస్.ఓ శ్రీనివాస్ గౌడ్, విద్యార్థులు, మహిళలు యువకులు, వయోవృద్ధులు, ఎన్సిసి, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.