నోరు అదుపులో ఉంచుకోండి

19-04-2024 12:55:00 AM

l కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మాజీ మంత్రి జగదీశ్ హితవు

l 20 వేల కోట్లతో బీజేపీని మోసం చేసిన నాయకుడు ఒకరు

l కాంగ్రెస్‌లో ఉండి బీజేపీకి ఓటెయ్యాలని చెప్పింది మరొకరు 

నల్లగొండ, ఏప్రిల్ 18(విజయక్రాంతి): కోమటిరెడ్డి బ్రదర్స్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హితవు పలికారు. ఇటీవల కేసీఆర్, జగదీశ్‌రెడ్డిపై కోమటిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో నల్లగొండలో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు పదవి కాపాడుకోవడానికి, మరొకరు మంత్రి పదవి కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను ఎవరు ఎక్కువ తిడితే వారికి పదవులు దక్కుతయని వారుభావిస్తున్నారని అన్నారు.

రాజకీయాలను వ్యాపారమయంగా చేశారని ఆరోపించారు. దళారుల్లాగా పార్టీలకు అమ్ముడుపోయి కేసీఆర్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్‌గా ఉంటూ బీజేపీకి ఓటు వేసి, తమ్ముడిని గెలిపించాలని కోరిన వెంకట్‌రెడ్డి.. కేసీఆర్ కాలుగోటికి కూడా సరిపోడు అని దుయ్యబట్టారు. కేసీఆర్ విజ్ఞతతో సరళమైన పదాలతో మాట్లాడుతున్నారని స్పష్టంచేశారు. కేసీఆర్‌తో పొల్చుకున్నప్పడు సీఎం రేవంత్‌రెడ్డి వందశాతం లిల్లిపుట్ అని ఉద్ఘాటించారు. ప్రజలపై కేసీఆర్‌కు ఉండే నిబద్ధత, తపన ప్రజలపై ఉన్న అభిమానం కాంగ్రెస్ వారికి లేదని చెప్పారు. కేసీఆర్ ఒక వైట్ పేపర్ లాంటి వారని స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే .. రేవంత్ బడేభాయ్ అంటూ పొగుడుతున్నాడని విమర్శించారు.

రాహుల్‌ను అరెస్టు చేసే సమయంలో కూడా  ముఖ్యమంత్రి రేవంత్ మోదీని ఒక్కసారి కూడా విమర్శించలేదని గుర్తుచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జైలుకు వెళ్లడం తప్పు కాదని, జగదీశ్‌రెడ్డికి జైళ్లు కొత్తేమీ కాదని చెప్పారు. వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి కోట్లు తీసుకొని ఎగవేసిన వారు కచ్చితంగా జైలుకు వెళ్తారని అన్నారు. రూ.20 వేల కోట్లు తీసుకొని ఒకరు ఒక పార్టీని మోసం చేశారని, వారికి త్వరలో ప్రజలే సరైన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. రాజకీయాలతో నల్లగొండ నీరు అమ్మి, ప్రజల రక్తం తాగి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వేసిన భిక్షతో బతికిన నాయకులు అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విరుచుకుపడ్డారు.

సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు సంధినేని జనార్దన్‌రావు పార్ధీవ దేహనికి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు.