calender_icon.png 31 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖలీదా కన్నుమూత

31-12-2025 12:43:28 AM

వృద్ధాప్య సమస్యలతో చికిత్సపొందుతూ బంగ్లా మాజీ ప్రధాని తుదిశ్వాస

  1. నేడు ఢాకాలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
  2. భారత తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు
  3. బంగ్లా అభివృద్ధిలో ఆమెది కీలకపాత్ర: ప్రధాని మోదీ
  4. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాట యోధురాలు: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
  5. మూడు రోజులు సంతాప దినాలు 
  6. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటన

ఢాకా, డిసెంబర్ ౩౦: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధినేత్రి ఖలీదా జియా(80) కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆమె లివర్ సిర్రోసిస్, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, ఊపిరిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి పరిస్థితి విషమించగా కుటుంబ సభ్యులు ఆమెను ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు.

రాజకీయాల్లో ఒక ధ్రువతారగా వెలిగిన ఖలీదా జియా నిష్ర్కమణతో బంగ్లాదేశ్‌లో ఒక సుదీర్ఘ రాజకీయ అధ్యాయం ముగిసినట్లయింది. ఖలీదా జియా కేవలం బంగ్లాదేశ్ నాయకురాలిగానే కాకుండా అవిభాజ్య భారత్‌తోనూ విడదీయలేని అనుబంధం ఉన్న నేతగా ఆమె గుర్తింపు పొందారు.

ఖలీదా జియా మృతికి సంతాపంగా బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ మూ డు రోజుల పాటు ప్రభుత్వ సంతాప దినాలను ప్రకటించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుధవారం అంత్యక్రియల రోజున దేశవ్యాప్తంగా సాధారణ సెలవు ప్రకటించారు. అంత్యక్రియలకు భారత తరఫున విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ హాజరుకానున్నారు. 

అనివార్యంగా రాజకీయ ప్రవేశం

ఖలీదా జియా స్వ స్థలం అవిభాజ్య భారత్‌లోని పశ్చిమ బెంగాల్. ఆమె 1945 ఆగస్టు 15న జల్పాయిగురిలో జన్మించారు. దేశ విభజన తర్వాత ఆమె కుటుంబం ఇప్పటి బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. 1960లో ఆమె సైనిక అధికారి జియావుర్ రెహమాన్‌ను వివాహం చేసుకున్నారు. ఖలీదా మొదట్లో సాధారణ గృహి ణి. 1971 బంగ్లా విముక్తి పోరాటంలో ఆమె భర్త కీలక పాత్ర పోషించి దేశాధ్యక్షుడిగా ఎదిగారు. రాజకీయాల్లోకి ఖలీదా రాక అనుకోకుండా జరిగింది.

1981లో తన భర్త రెహమాన్ హత్యకు గురికావడంతో ఆమె అనివార్యంగా బీఎన్‌పీ అధ్యక్షు రాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. సైనిక నియంత పేరున్న హుస్సేన్ మహమ్మద్ ఇర్షాద్ పాలనకు వ్యతిరేకంగా ఆమె సాగించి 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.  ఆ దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఆమె చరిత్ర సృష్టించారు. ప్రధానిగా మూడు పర్యాయాలు సేవలందించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

1992లో భారత్- -బంగ్లా మధ్య జరిగిన ‘తీన్ బిఘా’ కారిడార్ ఒప్పందం ఆమె హయాంలోనే కార్యరూపం దాల్చింది. అయితే.. రానురాను ఆమె రాజకీయ వైఖరిలో మార్పు వచ్చింది. రెండోసారి ప్రధాని పగ్గా లు చేపట్టిన తర్వాత ఆమె భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని అవలంబించారు. బంగ్లా సార్వభౌమత్వానికి భారత్ ముప్పుగా పరిణమిస్తోం దని ఆమె అనేకసార్లు తన ప్రసంగాల్లో పేర్కొన్నారు. ఆమె భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేశారు. ఉల్ఫా వేర్పాటువాదులను స్వాతంత్య్ర సమరయోధులని అభివర్ణించారు.

ఈ క్రమంలోనే ఆమె పాకిస్థాన్, చైనాతో సంబంధాలను పెంచుకుంటూ భారత్ నుంచి దూరం జరిగేలా తన విదేశాంగ విధానాన్ని మార్చుకున్నారు. ఖలీదా చరమాంకంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణల కేసులో 2018లో ఆమెకు జైలు శిక్ష పడింది. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఆరోగ్యం క్షీణించడంతో గృహ నిర్బంధంలోనే గడిపారు. హసీనా ప్రభుత్వం పడిపోవడంతో ఆమె జైలు నుంచి విముక్తి పొందారు. ఆమె కుమారుడు తారిఖ్ రెహమాన్ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటయోధురాలు

ఖలీదా జియా మరణ దిగ్భ్రాంతి కలిగించింది. రాజకీయాల్లో మేం ప్రత్యర్థులం అయినప్పటికీ దేశాభివృద్ధిలో ఖలీదా జియా పాత్రను కాదనలేం. బంగ్లాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆమె ఎన్నో పోరాటాలు చేశారు. ఆమె అంకితభావం వెలకట్టలేనిది. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు నేను సంతాపం తెలియజేస్తున్నాను. బీఎన్‌పీ కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. బంగ్లాదేశ్ ఒక గొప్ప నాయకురాలిని కోల్పోయింది. ఆమె నిష్క్రమణతో బంగ్లాలో ఒక శకం ముగిసినట్లయింది.           

 హసీనా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని

బంగ్లా అభివృద్ధిలో ఆమెది కీలకపాత్ర

బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ఖలీదా జియా రికార్డు అద్భుతం. మూడుసార్లు ఆమె ఆ దేశ ప్రధానిగా పనిచేసి దేశాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషింంచారు. భారత్- - బంగ్లాదేశ్ మధ్య ద్వుపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమె అందించిన సహకారం ప్రశంసనీయం. 2015లో ఢాకా పర్యటన సందర్భంగా నేను ఖలీదా జియాతో భేటీ అయ్యాను. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక బంధానికి బాటలు వేయాలని ఆమె నాడు ఆకాంక్షించారు.        

 మోదీ, భారత ప్రధాని