27-01-2025 11:27:49 PM
కర్ణాటక జట్టుకు ఎంపిక
బెంగళూరు: టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. ఎలైట్ గ్రూప్ ఈ నెల 30న టేబుల్ టాపర్స్ అయిన హర్యానాతో కర్ణాటక అమీతుమీ తేల్చుకోనుంది. కాగా ఈ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ అందుబాటులోకి రానున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడిన రాహుల్ మోచేతి గాయంతో ఇబ్బంది పడ్డాడు. జనవరి 21న బీసీసీఐకి రిపోర్ట్ చేసిన రాహుల్ ఎన్‌సీఏలో చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ మెడికల్ టీమ్ రాహుల్‌ను పరీక్షించిన అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు రిపోర్టు ఇచ్చింది. దీంతో హర్యానాతో మ్యాచ్‌లో ఈ వికెట్ కీపర్ ఆడనున్నాడు. కాగా రాహుల్ రంజీల్లో తన చివరి మ్యాచ్‌ను 2020లో బెంగాల్‌తో ఆడాడు. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు దేశవాలీ క్రికెట్‌లో ఆడాల్సిందేనంటూ బీసీసీఐ హుకుం జారీ చేయడంతో సీనియర్ల నుంచి జూనియర్ల దాకా అందరూ బరిలోకి దిగారు. మొన్న జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆయా జట్ల తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ సహా యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా బరిలోకి దిగారు. తాజాగా కేఎల్ రాహుల్, ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ కూడా చాలా కాలం తర్వాత రంజీ మ్యాచ్ ఆడనుండడం విశేషం.