calender_icon.png 27 September, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

27-09-2025 05:29:52 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణా ఉద్యమ కారులని, స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, అయనను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని  కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర  సమర యోధుడుగా, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్య పాత్ర పోషించారన్నారు. వారి సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 1969వ సంవత్సరంలో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా దీక్షను చేయడమే కాకుండా తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమానికి అండగా నిలిచిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన యోధుడు, తనకంటూ ఏమి లేకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తన ఆస్తులు దానం చేసిన త్యాగశీలి అన్నారు. ఆయన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు, బడగు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలను అధికారికంగా జరపడం చాలా సంతోషంగా ఉందని   ఆయన పేర్కొన్నారు.