15-09-2025 02:59:01 PM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ రైతులు(Kondapur farmers) బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును(Harish Rao) సోమవారం కలిశారు. ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. తమ భూములు కోల్పోకుండా, అలైన్మెంట్ లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని, పాత అలైన్మెంట్(RRR alignment) ని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి హరీష్ రావుకి రైతులు గోడు వెల్లబోసుకున్నారు. రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ కోసం అలైన్ మెంట్ ను ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. అలైన్ మెంట్ మార్చి పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు భూములు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సొంత భూములకు మేలు కలిగేలా అలైన్ మెంట్ మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతుల ఆవేదన సీఎం రేవంత్ రెడ్డికి అర్ధం కావడం లేదా? అలైన్ మెంట్ మార్పుతో కేంద్రం ఆర్ఆర్ఆర్ ను తిరస్కరించే పరిస్థితి వస్తోందని హెచ్చరించారు. ఉత్తర భాగాన అలైన్మెంట్ మార్పు వల్ల సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలంలోని గిరిమాపూర్, తుమ్మరపల్లి, అలియాబాద్, మారేపల్లి, రాంపూర్ తాండ, గోటిలగుట్ట తండా, మాచేపల్లి తండా, శివన్న గూడెం, గంగారం గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఎక్కువగా ఉన్న ఎస్టీ, ఎస్సీ బీసీ రైతులే ఉన్నారని తెలిపారు. రైతులు భూములు కోల్పోవద్దనే మొదటగా ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ను బీఆర్ఎస్ సర్కార్ గిర్మాపూర్ చేవెళ్ల మీదుగా ప్రతిపాదించిందని గుర్తుచేశారు. సమస్య పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.