15-09-2025 03:40:48 PM
డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్
చండూరు (విజయక్రాంతి): శాస్త్రీయ విద్యా విధానం కొరకు విద్యార్థి లోకం ఉద్యమించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిలు కోట రమేష్, అనగంటి వెంకటేష్ లు అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలోని శీలా అనసూయ ఫంక్షన్ హాల్ లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల రెండవ రోజు మతం మతోన్మాదం, సోషలిజం విశిష్టత ఔన్నత్యం క్లాస్ బోధించడం జరిగింది. ఈ సందర్భంగా వారు విద్యార్థి నాయకులనుద్దేశించి మాట్లాడుతూ, దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో విద్యారంగంలోకి మతోన్మాద కాషాయికరణ బిజాలు నాటుతూ విద్యార్థి లోకానికి మూడ విశ్వాసాలు మూఢనమ్మకాలు బోధిస్తూ విద్యార్థులకు ఆశాస్త్రీయమైన అలవాటును సమాజానికి ఉపయోగపడని విషయాలను బోధిస్తూ ఈ దేశంలో విద్యా రంగాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకోబోతూ విద్యారంగంలోకి నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడం కోసం బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందని దానికి వ్యతిరేకంగా విద్యార్థులందరు సంఘటితమై విద్యారంగంలోకి మతోన్మాద కాషాయీకరణ నీడలు రాకుండా పోరాడాల్సిన బాధ్యత నేటి విద్యార్థి లోకంపై ఉందన్నారు. దేశంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు విద్యారంగాన్ని తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తూ విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ చేతుల్లో అప్పగించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని అన్నారు. విద్య అనేది అంగడిలో సరుకుగా మార్చుతూ SC, ST, BC పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలా మార్చుకున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయకుండా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులు ఏ విధంగా ముందుకు పోతాయో రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పటికీ రాష్ట్రంలో బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలు జరుగుతున్న నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం కోసం రేవంత్ రెడ్డి బిజెపి బాటలో నడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంతరిస్తున్న విద్యావ్యతిరేక విధానాల పైన విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులందరినీ ఏకం చేసి అందరికీ శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయడం కోసం, చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి యువకులకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పాలక ప్రభుత్వాలపైన బలమైన సమరశీల పోరాటాలు చేయాలని పిలుపు నివ్వడం జరిగింది. గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేయడంలో దొందు దొందే అన్నట్లే వ్యవహరిస్తూ విద్యార్థులతో నిరుద్యోగుల జీవితాలతో చలగాటమాడుతున్నారని అన్నారు. విద్యార్థులు నిరుద్యోగులు తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మం పాటి శంకర్, రాష్ట్ర గర్ల్స్ కోకన్వీనర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కుర్ర సైదానాయక్, కుంచం కావ్య స్పందన, బుడిగ వేంకటేష్ కోరే రమేష్, ముస్కు రవిందర్, మారుపాక కిరణ్, నవదీప్, జగన్ నాయక్ జగదీష్, వీరన్న, ప్రసన్న, ప్రణిత్, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.