01-09-2025 12:27:36 AM
నిరసన తెలుపడంలోనూ ఓ యువకుడు గణనాధున్ని ఆసరాగా చేసుకున్నాడు. మహబూబా బాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారంతోపాటు పట్టణ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ రూపొందించిన ప్లకార్డులతో ‘గణనాధుని’ రూపం తో పట్టణ కేంద్రానికి చెందిన లవన్ స్థానిక గాంధీ సెంటర్ లో వినూత్న నిరసన తెలిపారు.
అసెంబ్లీ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన డోర్నకల్ పట్టణంలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, వంద పడకల ఆసుపత్రి కావాలని, కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని, అంతర్గత రహదారులను సిసి రోడ్లుగా మార్చాలని, వీధి కుక్కలు పందు లను నిర్మూలించాలంటూ రూపొందించిన ప్లకార్డులతో గణనాథుడి రూపాన్ని ప్రతిష్టించాడు. ప్లకార్డులతో ఆసక్తికరంగా ఉన్న గణనాథుడి ఆకారాన్ని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం తాను వినూత్న రీతిని ఎంచుకున్నట్టు కుందోజు లవన్ తెలిపాడు.