05-07-2025 12:42:27 AM
తండ్రి స్థానంలో విధులు నిర్వహిస్తున్న అటెండర్ సైతం..
కోటపల్లి (చెన్నూర్), జూలై 4: మంచిర్యాల జిల్లా కోటపల్లి డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్, అటెండర్ అంజి శుక్రవారం ఓ రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం గ్రామానికి చెందిన గంట నరేష్ తండ్రికి రాజా రం (కొత్తపల్లి) శివారులో 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది.
ఆ భూమికి పాస్ పుస్త కం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం లో సంప్రదించగా డీటీ నవీన్‌కుమార్ రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. బతిమిలాడగా రూ.10 వేలకు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత బాధితుడు నరేష్ ఏసీబీని ఆశ్రయించాడు.
వారి సూచన మేరకు శుక్రవారం నరేష్ నుంచి లంచం తీసుకుంటుండగా డీటీ నవీన్‌కుమార్‌తో పాటు కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న అంజిలను పట్టుకున్నారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకొని కరీంనగర్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. కాగా కోటపల్లిలో అటెండర్ జామిడి సమ్మయ్య విధులు నిర్వహిస్తుండగా ఆయన అనారోగ్యంతో బాధపడు తున్నాడని ఆయన స్థానంలో కొడుకు అంజి పనిచేస్తున్నట్టు ఏసీబీ అధికారుల దాడిలో బయటపడింది.