calender_icon.png 18 December, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోట్లాభిషేకం

17-12-2025 01:05:39 AM

ఐపీఎల్ వేలంలో ఆల్‌రౌండర్లపై కాసుల వర్షం కురిసింది. స్వదేశీ , విదేశీ అనే తేడా లేకుండా మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్స్‌పై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. ఈ క్రమంలో ఊహించినట్టు గానే గ్రీన్ రికార్డు ధర పలికాడు. అలాగే మహేశ్ పతిరణ సైతం జాక్‌పాట్ కొట్టాడు. స్వదేశీ ప్లేయర్స్‌లో వెంకటేశ్ అయ్యర్ ధర భారీగా పడి పోగా.. రవి బిష్ణోయ్ రాజస్థాన్‌కు అమ్ముడయ్యాడు. ఇక పలు రౌండ్లలో అమ్ముడుపోని పృథ్వీషా, సర్ఫరాజ్‌లను ఫ్రాంచైజీలు చివరి నిమిషంలో తీసుకున్నాయి. మొత్తం మీద అంచనాలకు తగ్గట్టే సాగిన వేలంలో విదేశీ స్టార్లకు మాత్రం ఫ్రాంచైజీలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి.

  1. కామెరూన్ గ్రీన్‌కు జాక్‌పాట్
  2. పతిరణకు భారీ ధర స్టార్ ప్లేయర్స్‌కు షాక్
  3. అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌కే ప్రాధాన్యత

అబుదాబీ, డిసెంబర్ 16 : ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఊహించినట్టుగానే భారీ ధర పలికాడు. ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడిన వేళ గ్రీన్ జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రూ.25.20 కోట్లకు అమ్ముడయ్యాడు. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని రికార్డు ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. వేలం గ్రీన్ కోసం పోటీ ఓ రేంజ్‌లో జరిగింది.

అత్యధిక మనీ పర్స్ ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడగా.. మధ్యలో చెన్నై కూడా రేసులోకి వచ్చింది. అయితే ప్రధాన పోటీ మాత్రం కేకేఆర్, సీఎస్కేల మధ్యనే నడిచింది. రెండు ఫ్రాంచైజీలు ఈ ఆసీస్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడడంతో బిడ్డింగ్ పెరుగుతూ పోయింది.చివరికి రూ.25 కోట్ల దగ్గర చెన్నై ఆగిపోవడంతో కోల్‌కతా దక్కించుకుంది.

దీంతో గ్రీన్ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. గతంలో మిఛెల్ స్టార్క్‌ను కోల్‌కతానే రూ.24.75 కోట్లకు కొనుగోలు చేయగా..ఇప్పుడు ఆ రికార్డును గ్రీన్ బ్రేక్ చేశాడు.అలాగే ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గానూ నిలిచాడు. ప్రస్తుతం పంత్ రూ.27 కోట్లు, శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే గ్రీన్ తర్వాత అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్స్‌లో లంక పేసర్ మహేశ్ పతిరణ రెండో స్థానంలో నిలిచాడు. చెన్నై రిలీజ్ చేసిన పతిరణ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. పతిరణ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పోటీపడినా చివర్లో తప్పుకుంది. దీంతో కేకేఆర్ రూ.18 కోట్లకు అతన్ని దక్కించుకుంది. చెన్నై జట్టుతో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన పతిరణ తొలిసారి కొత్త జట్టుకు ఆడబోతున్నాడు.

ఇక పతిరణ తర్వాత లివింగ్‌స్టోన్ అత్యధిక ధర పలికాడు. తొలి రౌండ్లలో అమ్ముడుపోని లివింగ్ స్టోన్ యాక్సిలేరేటెడ్ రౌండ్‌లో జాక్‌పాట్ కొట్టాడు.రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన లివింగ్‌స్టోన్ కోసం లక్నో, సన్‌రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. చివరికి మనీ పర్స్ సరిపోకపోవడంతో లక్నో తప్పుకోగా లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ రూ.13 కోట్లకు దక్కించుకుంది.

జోస్ ఇంగ్లీస్‌ను లక్నో రూ.8.60 కోట్లకు దక్కించుకోగా..వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ కూడా జాక్‌పాట్ కొట్టాడు. హోల్డర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక విదేశీ ఆటగాళ్ళలో మిల్లర్ రూ.2 కోట్లు(ఢిల్లీ), బెన్ డకెట్ రూ.2 కోట్లు(ఢిల్లీ), హసరంగా రూ.2 కోట్లు(లక్నో), డికాక్ రూ.2 కోట్లు(ముంబై), ఫిన్ అలెన్ రూ. 2కోట్లు(కేకేఆర్), జాకబ్ డఫ్పీ రూ.2 కోట్లకు(ఆర్సీబీ) అమ్ముడయ్యారు. మరోవైపు వేలంలో భారత ఆటగాళ్లు కూడా సత్తా చాటారు. అయితే గత మెగా వేలంలో రికార్డు ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ ఈ సారి కేవలం రూ.7 కోట్లకే ఆర్సీబీకి అమ్ముడయ్యాడు.

అలాగే స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రూ.7.20 కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది. తొలిరౌండ్లలో అమ్ముడు పోని రాహుల్ చాహర్ ఊ హించని విధంగా చివర్లో రూ.5.20 కోట్ల ధర పలికాడు.ఆకాశ్ దీప్ కోటి రూపాయలకే కేకేఆర్ సొంతమయ్యాడు. ఇదిలా ఉంటే పృథ్వీ షా ఎట్టకేలకు వేలంలో అమ్ముడయ్యాడు. తొలి రౌండ్లలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పృథ్వీ షాను యాక్సిలిరేటెడ్ రౌండ్‌లో రూ.75 లక్షల కనీస ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.