18-12-2025 12:13:04 AM
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 17 (విజయక్రాంతి): సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బీఆర్‌ఎస్ అద్భుత విజయం సాధించిందని, సిరిసిల్ల గడ్డ మరోసారి గులాబీ అడ్డా అని రుజువైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 117 గ్రామ పంచాయతీలకు గాను, బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఏకంగా 80 స్థానాల్లో ఘనవిజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారని తెలిపారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలలోని 117 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరగగా 80 స్థానాలలో బిఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపిన పార్టీ నాయకులు విజయం సాధించారు. అధికార దుర్వినియోగము, బల ప్రయోగము వంటి పద్ధతుల్లో ప్రయత్నం చేసిన అధికార పార్టీ కాంగ్రెస్ కేవలం 24 స్థానాల్లో చాలా కష్టం మీద గెలిచింది. బిజెపి మాత్రం కేవలం 13 గ్రామ పంచాయతీల్లో తమ పార్టీ మద్దతు దారులను గెలిపించుకోగలిగింది.
నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల పైన కేటీఆర్ స్పందిస్తూ& ‘గత రెండు దశాబ్దాలుగా సిరిసిల్ల ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీతో ఉన్న అనుబంధం ఎంత బలమైనదో ఈ ఫలితాలు మరోసారి తేల్చిచెప్పాయి. ఉద్యమ పార్టీగా ఉన్నా, అధికార పార్టీగా ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సిరిసిల్ల ప్రజలు గులాబీ జెండానే గుండెల్లో పెట్టుకున్నారు‘ అని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ తెలియజేశారు.
ఎన్నికల కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ విజయం సిరిసిల్ల ప్రజలు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా, బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టి, కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బీఆర్‌ఎస్ పార్టీపై నమ్మకం ఉంచి 80 స్థానాల్లో గెలిపించిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు వందనం చేస్తున్నాను‘ అని కేటీఆర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఎంపిటిసి జడ్పిటి సి ఎన్నికలకు సంసిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు
సిరిసిల్లలో కాంగ్రెస్ దయనీయ స్థితి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో చతికిలపడింది. ‘అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు కేవలం 24 స్థానాలకే పరిమితమయ్యారు. దాదాపు 50కి పైగా గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ నియోజ కవర్గ ఇన్చార్జ్ (కేకే) సొంత మండలంలోనే ఆ పార్టీకి ప్రజలు చుక్కలు చూపించారు. వారి సొంత ఇలాకా అయిన ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ గెలిచింది కేవలం 3 పంచాయతీలు మాత్రమే. దీన్ని బట్టి అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బండి సంజయ్ ప్రగల్భాలకు చెక్..
ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ‘సిరిసిల్లలో మెజారిటీ స్థానాలు గెలుస్తామని బండి సంజయ్ ప్రగల్భాలు పలికారు. కానీ ప్రజలు బీజేపీని పూర్తిగా తిరస్కరించారు. కేవలం 13 స్థానాలతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు అన్ని గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు నామమాత్రపు పోటీ ఇచ్చి ఓటమి పాలయ్యారు. బీజేపీకి సిరిసిల్లలో ఉనికి లేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.