18-12-2025 12:32:49 AM
55 శాతం ప్రైమరీ ఎనర్జీ బొగ్గు నుంచే ఉత్పత్తి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): నేటికీ భారతదేశంలో 55 శాతానికి పైగా ప్రైమరీ ఎనర్జీ బొగ్గు నుంచే వస్తోందనీ, దాదాపు 75 శాతం విద్యుత్ ఉత్పత్తి బొగ్గుపై ఆధారపడి జరుగుతోందనీ, అందుకే దేశీయ బొగ్గు ఉత్పత్తి భారత్‌కు ఎంతో అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత పదేళ్లుగా అమలు చేసిన సంస్కరణల ఫలితంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి దిశగా బొగ్గురంగం వేగంగా ముందుకెళ్తోందనీ తెలిపారు.
ఢిల్లీలో జరిగిన ‘ఫ్యూచర్ కోల్’- ఇండియా చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం పాల్గొని మాట్లాడారు.రాబోయే దశాబ్దంలో భారత్ మరింతగా అభివృద్ధి దిశగా దూసుకుపోతుందనీ, అయితే ఈ వృద్ధిలో బొగ్గు వాటా తగ్గినా డిమాండ్ మాత్రం అనేక రెట్లు పెరుగుతుందనీ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయనీ, ఈ రంగంలో పారదర్శకత పెరిగి నమ్మకానికి మారుపేరుగా మారిందనీ, దీంతో బొగ్గు ఉత్పత్తి 565 మిలియన్ టన్నుల నుంచి 1 బిలియన్ టన్నులకు పైగా పెరిగిందన్నారు.
తొలిసారిగా బొగ్గు నిల్వలు 50 మిలియన్ టన్నులను దాటాయనీ, దిగుమతులు 26 శాతం నుంచి సుమారు 19 శాతానికి తగ్గాయనీ చెప్పారు.మూతపడ్డ గనుల వద్ద పర్యావరణ పునరుద్ధరణకు కేంద్ర బొగ్గు శాఖ అనేక చర్యలు చేపట్టిందన్నారు. ‘మిషన్ గ్రీన్’ కింద 2030 నాటికి 74 వేల హెక్టార్లలో పచ్చదనాన్ని పెంచాలనేది లక్ష్యం అన్నారు. 2047 నాటికి దేశం వికసిత భారత్ గా మారనున్న నేపథ్యంలో ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.