18-12-2025 12:00:00 AM
98 జీపీలకు, 711 వార్డులకు ఎన్నికలు
87.78 శాతం పోలింగ్ నమోదు
మంచిర్యాల, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియో జక వర్గంలోని భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని గ్రామ పంచాయతీలు, వార్డు సభ్యుల ఎన్నిక కోసం బుధ వారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. 98 జీపీలకు, 711 వార్డులకు 114 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరిపారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సహాయ ఎన్నికల అధికారి, డీపీఓ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యం లో ఏసీపీలు, సీఐలు, ఎస్త్స్ర, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
98 జీపీలకు 390 మంది...
జిల్లాలోని చెన్నూర్ నియోజక వర్గంలో మూడవ విడుత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఐదు మండలాల్లో 102 గ్రామ పంచాయతీలుండగా నాలుగు (చెన్నూర్‌లోని రచ్చపల్లి, కోటపల్లిలోని ఎస న్ వాయి, లక్మ్షీపూర్, మందమర్రిలోని శంకర్ పల్లి) జీపీలు ఏకగ్రీవం కాగా 98 (భీమారంలోని 11, చెన్నూర్ లోని 29, జైపూర్ లోని 20, కోటపల్లిలోని 29, మందమర్రిలోని తొమ్మది) గ్రామ పంచాయతీలకు 390 (భీమారంలో 46, చెన్నూర్ లో 115, జైపూర్ లో 81, కోటపల్లిలో 110, మందమర్రిలో 38) మంది అభ్యర్థులు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీపడ్డారు.
711 వార్డులకు 1,905 మంది పోటీ...
జిల్లాలోని చెన్నూర్ నియోజక వర్గంలోని ఐదు మండలాల పరిధిలో 868 వార్డులున్నాయి. ఇందులో నాలుగు (భీమారంలోని మూడు, కోటపల్లిలోని ఒక) వార్డులకు నామినేషన్ లు దాఖలు కాకపోవడం, 153 (భీమారంలోని 23, చెన్నూర్ లోని 45, జైపూర్ లోని ఆరు, కోటపల్లిలోని 58, మందమర్రిలోని 21) వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగితా 711 (భీమారంలోని 68, చెన్నూర్ లోని 190, జైపూర్ లోని 180, కోటపల్లిలోని 190, మందమర్రిలోని 65) వార్డులకు 1,905 (భీమారంలో 190, చెన్నూర్ లో 513, జైపూర్ లో 494, కోటపల్లిలో 522, మందమర్రిలో 186) మంది అభ్యర్థులు వార్డు సభ్యుడి ఎన్నిక కోసం పోటీపడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఉప సర్పంచులను ఎన్నుకున్నారు.
అధికారుల పరిశీలన...
మూడవ విడత ఎన్నికలలో భాగంగా చెన్నూర్ నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో జరిగిన ఎన్నికల సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ లు తిరిగి పరిశీలించారు. జైపూర్ మండలంలోని ఇందారం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, భీమారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు.
మందమర్రి, జైపూర్, భీమారం, కోటపల్లి, చెన్నూర్ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను డీసీపీ ఎగ్గడి భాస్కర్ సందర్శించి పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాల వెల్లడిపై బందోబస్తు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జైపూర్ మండలం ఇందారంలోని పోలింగ్ కేంద్రాన్ని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ సందర్శించి పోలింగ్ పరిస్థితిని పరిశీలించారు.
ఐదు మండలాల్లో 87.78 శాతం ఓటింగ్...
ఐదు మండలాల్లో 1,06,889 (52,810 పురుషులు, 54,075 మహిళలు, నలుగురు ఇతరులు) మంది ఓటర్లున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొమ్మిది గంటల వరకు 29,017 (27.15 శాతం), 11 గంటల వరకు 66,676 (62.38 శాతం), మధ్యాహ్నం ఒంటి గంట వరకు 91,412 (85.52 శాతం) పోలింగ్ జరిగింది. ఒంటి గంట తర్వాత పోలింగ్ కేంద్రాలలో క్యూలో నిలబడ్డ వారు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత 93,822 (87.78 శాతం) ఓట్లు పోలయ్యాయి.
పోలింగ్ ముగిసే సరికి భీమారం మండలంలో 11,547 (88.19 శాతం), చెన్నూర్ లో 22,928 (87.84 శాతం), జైపూర్ లో 26,277 (85.80 శాతం), కోటపల్లిలో 23,255 (89.65 శాతం), మందమర్రి మండలంలో 9,815 (88.21 శాతం) మంది ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసున్నారు.